ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు | | ACTPnews

ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు


Last Updated:

మన పల్లెటూళ్లో నాట్లు వేస్తున్న విదేశీయులు.. ఈ రైతు ఐడియాకు ఫారినర్స్ ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా?

ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు
ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు

వ్యవసాయం అంటే కేవలం పొలంలో కష్టపడి పంటలు పండించి మార్కెట్లో అమ్ముకోవడం మాత్రమే కాదు.. అంతకుమించి అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఒక ఆదర్శ రైతు. కేవలం ఐదెకరాల వ్యవసాయ భూమిని అగ్రి టూరిజం కేంద్రంగా మార్చి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ.. ఏటా పది లక్షల రూపాయల ఆదాయం గడిస్తున్నాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పర్యాటకుల బస, భోజనానికి, క్షేత్ర సందర్శనకు ఎలాంటి నిర్ణీత ధర లేదు. అగ్రి టూరిజం అనుభూతి పొందిన తర్వాత పర్యాటకులు తమకు నచ్చినంత డబ్బు ఇచ్చి వెళ్లొచ్చు.

లోకల్18 ప్రతినిధి పూజ ఎంఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకా పాలహళ్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన పర్యాటక రంగంగా మలిచాడు. పాలహళ్లి వెళ్తే అబ్బురపరిచే దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ఐర్లాండ్, ఫ్రాన్స్, హంగేరీ, జింబాబ్వే, ఆస్ట్రేలియా లాంటి విదేశాలతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ సాధారణ కూలీల్లా పనిచేస్తుంటారు. సేంద్రియ ఎరువులు మోయడం, వరి నాట్లు వేయడం, పంట కోయడం లాంటి పనులు స్వయంగా చేస్తూ వ్యవసాయ క్షేత్రంలోనే నివసిస్తారు. క్షేత్రస్థాయిలో ఉంటూ పల్లె వాతావరణాన్ని, రైతన్నల కష్టాన్ని దగ్గరుండి అనుభూతి చెందుతారు.

కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణులు ఫ్రాంక్లిన్, సంగీత పరిచయంతో వెంకటేశ్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. వారి సలహాతో రసాయన సాగును పూర్తిగా వదిలేసి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. ఆ క్రమంలోనే తన పొలాన్ని ఇతరులకు వ్యవసాయం నేర్పించే వేదికగా మార్చాలనే గొప్ప ఆలోచన పుట్టింది. సుమారు ఐదేళ్ల క్రితం వాలంటీర్లను, రైతులను కలిపే ‘వూఫ్ (WWOOF)’, ‘వర్క్‌అవే’ వెబ్‌సైట్లలో తన వ్యవసాయ క్షేత్రాన్ని సంగీత నమోదు చేశారు. దీంతో ఈ చిన్న పల్లెటూరు ప్రపంచ పటంలోకి ఎక్కింది. విదేశీయులు ఆన్‌లైన్‌లో సంప్రదించి నేరుగా ఇక్కడికి రావడం మొదలుపెట్టారు.

ప్రతి ఏటా సుమారు 15 బ్యాచ్‌ల విదేశీ పర్యాటకులకు వెంకటేశ్ అత్యద్భుతమైన ఆతిథ్యం ఇస్తున్నాడు. ఒక్కో బ్యాచ్‌లో నలుగురు చొప్పున వచ్చి 10 నుంచి 15 రోజుల పాటు ఇక్కడే ఉంటూ వ్యవసాయం నేర్చుకుంటారు. భద్రత దృష్ట్యా పోలీసుల వెరిఫికేషన్ పూర్తయ్యాకే విదేశీయులకు అనుమతి ఇస్తారు. ఆశ్చర్యకరంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వెంకటేశ్ ఎలాంటి ఫీజు డిమాండ్ చేయడు. పది రోజులు పాటు ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తాడు. తిరిగి వెళ్లే సమయంలో పర్యాటకులు వ్యవసాయ అనుభూతికి మురిసిపోయి తమకు నచ్చినంత మొత్తాన్ని సంతోషంగా ఇచ్చి వెళుతుంటారు. కేవలం ఈ అగ్రి టూరిజం ద్వారానే వెంకటేశ్ ఏటా రూ. 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.

ఈ ఐదెకరాల పొలంలో ఒకే పంటపై ఆధారపడకుండా విభిన్న రకాల వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజముడి, రత్నచూడి, నవరా, హెచ్ఎంటీ, సిద్దసన్న లాంటి దేశవాళీ వరి రకాలతో పాటు రాగులు, జొన్నలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నాడు. పర్యాటకులు తాము పండించిన సేంద్రియ కూరగాయలనే ఆహారంగా తీసుకుంటారు. వీటితో పాటే గిర్, సాహివాల్, హల్లీకర్ జాతి ఆవుల పెంపకం, మేకల పెంపకం, చేపల చెరువులు, వర్మీ కంపోస్ట్ తయారీ లాంటివి సమగ్రంగా చేపడుతున్నాడు. ఇక్కడి ఆవుల ద్వారా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన పాలు, నెయ్యిని కూడా స్థానికంగా విక్రయిస్తుంటాడు.

ప్రస్తుతం ఈ వ్యవసాయ క్షేత్రం కేవలం అగ్రి టూరిజం స్పాట్‌గా కాకుండా ఒక శిక్షణా కేంద్రంగా రూపాంతరం చెందింది. వ్యవసాయ, ఉద్యానవన, పాడి పరిశ్రమ శాఖల అధికారుల సమన్వయంతో నేల రక్షణ, సేంద్రియ సాగు లాంటి అంశాలపై ఇతర రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వ్యవసాయం అంటే గిట్టుబాటు కాని రంగం అని బాధపడే ఎంతోమందికి వెంకటేశ్ సరికొత్త దారి చూపించాడు. ఐదెకరాల పొలాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి, విదేశీయులను సైతం ఆకర్షిస్తూ.. వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మార్చుకోవచ్చో ఆచరణాత్మకంగా నిరూపించి తోటి రైతులకు రోల్ మోడల్‌గా నిలిచాడు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed