Last Updated:
తెలంగాణలో HYDRAలో 16 మంది ట్రాన్స్జెండర్లను ఈగల్ టీమ్‌గా నియమించి ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడే బాధ్యత ఇచ్చి, వారికి గౌరవం, ఆర్థిక భద్రత కలిగింది
ఒకప్పుడు బిక్షాటనే జీవనాధారంగా మార్చుకున్న వాళ్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమాజం నుంచి అవమానాలు, ఎగతాళి, నిరాకరణ మాత్రమే ఎదుర్కొన్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో HYDRA ఉద్యోగం కొత్త వెలుగులు నింపింది. చేతిలో ఉద్యోగం, ఒంటిపై యూనిఫాం, సమాజంలో గౌరవం.. ఇవన్నీ కలిసి ఇప్పుడు వారి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తమకు ఇది కేవలం ఉద్యోగం కాదు.. కొత్త గుర్తింపు అంటూ HYDRAలో పనిచేస్తున్న ట్రాన్స్జెండర్లు భావోద్వేగంగా చెబుతున్నారు.
తెలంగాణలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పనిచేస్తున్న HYDRAలో ప్రస్తుతం 16 మంది ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించారు. అందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్ కాగా, ఐదుగురు ట్రాన్స్‌మెన్ ఉన్నారు. HYDRA ఈగల్ టీమ్ గా ప్రత్యేకంగా నియమించిన ఈ బృందం ఇప్పుడు ఆక్రమణల తొలగింపులో కీలక పాత్ర పోషిస్తోంది. కబ్జాదారులు ఎంతటి వారైనా వెనుకడుగు వేయకుండా ఫీల్డ్‌లో పనిచేస్తూ ప్రజా ఆస్తులను కాపాడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించే చర్యల్లో ఈగల్ టీమ్ చురుకుగా పాల్గొంది. అలాగే మాదాపూర్‌లో ఈదులకుంట పరిరక్షణ సమయంలో కూడా ట్రాన్స్జెండర్లు కీలక పాత్ర పోషించారు. ఆక్రమణలు తొలగించే సమయంలో ప్రజలకు పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడం, మహిళలతో మాట్లాడి ఉద్రిక్తతలను తగ్గించడం, అధికారులు–ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి పనుల్లో వారు ప్రత్యేక నైపుణ్యం కనబరుస్తున్నారు.
వారిలో సహనం ఎక్కువ. భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం ఉంటుంది. అందుకే ఫీల్డ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అంటూ HYDRA అధికారులు ప్రశంసిస్తున్నారు. గతంలో ఎక్కడ పని అడిగినా తిరస్కరణే ఎదురైన ట్రాన్స్జెండర్లు.. ఇప్పుడు అదే సమాజంలో గౌరవం పొందడం తమకు జీవితంలో అతిపెద్ద ఆనందమని చెబుతున్నారు.
తమ జీవితాల్లో డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది. HYDRA యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే ఇప్పుడు అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు అంటూ ట్రాన్స్జెండర్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
HYDRAలో పనిచేయడం వల్ల ఇప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్లు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. నెల జీతం వస్తోంది. ముఖ్యంగా మేమూ సమాజానికి ఉపయోగపడే వాళ్లమే అన్న నమ్మకం వారిలో బలపడింది. అవకాశం ఇస్తే ట్రాన్స్జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు. HYDRAలో మా పని అందుకు నిదర్శనం అని వారు గర్వంగా చెబుతున్నారు.
ప్రకృతిని కాపాడే పనిలో భాగస్వామ్యం కావడం తమకు మరింత సంతృప్తినిస్తోందని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు. చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ భూములను రక్షించే పనిలో తమ వంతు బాధ్యత నిర్వర్తించడం గర్వంగా ఉందంటున్నారు. ముఖ్యంగా HYDRA వంటి ప్రజల్లో విశ్వాసం ఉన్న సంస్థలో పనిచేయడం తమ జీవితానికి కొత్త అర్థం తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఒక ఉద్యోగం.. ఒక అవకాశం.. ఒక గౌరవం. ఇవే ఇప్పుడు ఎన్నో ట్రాన్స్జెండర్ల జీవితాలను చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చాయి.
Hyderabad,Hyderabad,Telangana













