Last Updated:
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని అజిత్ అగార్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్ 4తో తన పదవీకాలం ముగుస్తుండటంతో ఇక కొనసాగలేనని బీసీసీఐకి స్పష్టం చేశాడు. తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ పురుషుల ఎంపిక కమిటీ చైర్మన్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోనున్నాడు. అక్టోబర్ 4వ తేదీతో ఆయన ప్రస్తుత పదవీకాలం ముగియనుంది. ఈ గడువు తర్వాత తాను చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగలేనని అగార్కర్ బీసీసీఐ పెద్దలకు అధికారికంగా తెలియజేశాడు. బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే ఆయన ఈ నిర్ణయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్, తన పదవీకాలంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ విజయంతో సహా జట్టు సాధించిన ఎన్నో అద్భుత విజయాల్లో అగార్కర్ వ్యూహాలు దాగి ఉన్నాయి.
కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తూనే సీనియర్లకు విశ్రాంతి కల్పించే విధానాన్ని ఆయన విజయవంతంగా అమలు చేశాడు. అయితే, ఫిబ్రవరిలోనే బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన కీలక చర్చల్లో తన పదవీకాలం ముగిసిన తర్వాత వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని ఆయన ముందే సూచించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అగార్కర్ నిష్క్రమణతో తదుపరి చీఫ్ సెలెక్టర్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మాజీ వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఈ రేసులో ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువ ఆటగాళ్లతో అతనికి ఉన్న సాన్నిహిత్యం, ఆధునిక క్రికెట్‌పై ఉన్న అవగాహన అతనికి కలిసొచ్చే అంశాలు. పార్థివ్ పేరును బోర్డు పెద్దలు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అగార్కర్ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని బీసీసీఐ సభ్యులు ఆఫీస్ బేరర్లకు అప్పగించారు. సెలెక్షన్ కమిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను వారే చూసుకుంటారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అవసరమైతే అగార్కర్‌కు ఎక్స్టెన్షన్ ఇవ్వాలా లేక కొత్త వారిని ఎంచుకోవాలా అనే దానిపై వారు త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారు.
సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ వ్యవహారంతో పాటు జూనియర్ సెలెక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న మొత్తం ఐదు స్థానాలను భర్తీ చేసేందుకు కూడా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. దేశవాళీ క్రికెట్ అనుభవం ఉన్న మాజీ ఆటగాళ్లను ఈ పోస్టులకు ఎంపిక చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ రెండు కమిటీలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.














