మిస్టర్ మిడిల్ క్లాస్ రివ్యూ.. శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్లారులే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, లయ ప్రధాన పాత్రల్లో వచ్చిన కొత్త సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

News18
News18

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ జంటగా నటించిన సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నేడు (జూలై 17) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. బ్లూ.జే క్రియేషన్స్ బ్యానర్‌పై జీకే, చందు నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కామెడీ డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మొదటిసారిగా వేంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

వెంకటరమణ (శ్రీకాంత్) ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమ భక్తుడు. భార్య పద్మావతి (లయ), పిల్లలు, వృద్ధ తండ్రి (మురళీధర్ గౌడ్), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటాడు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతాడు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ.. ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వేంకటేశ్వర స్వామినే నిందిస్తాడు. భక్తుడి ఆవేదన విన్న స్వామి (రాజేంద్రప్రసాద్) ప్రత్యక్షమై, కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తాడు. అయితే అవి నకిలీవి (గిల్టీ నగలు) అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది.

ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తాడు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కానీ కొన్ని షరతులు పెడతాడు. అయితే, ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:

దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000-2010 దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్ లోకి టర్న్ తీసుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, సెకండాఫ్ లో బాగా బోర్ కొట్టించాడు. ఇంటర్వెల్ తర్వాత కథనం కాస్త రొటీన్‌గా సాగుతుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన ‘అఖండ’ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్‌లో “ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం” అనే ఒక మంచి సందేశంతో పాటు, పార్ట్-2 కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం.

నటీనటులు, సాంకేతిక వర్గం:

మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ.. భార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగెటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్‌లో, ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రఘుబాబు తమ కామెడీతో అలరించారు.

సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. శ్రీవారిపై వచ్చే రెండు భక్తి గీతాలు, దేవుడు-కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. దేవుడి గ్రాఫిక్స్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి, ఫస్టాఫ్ ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా చేసి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది.

ఓవరాల్‌గా.. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం కోసం చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్: 2.5

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports