మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

News18


Last Updated:

తిరుపతి 28వ వార్డు పెద్ద పీర్ల చావడిలో మటన్ మార్కెట్‌పై దాడి, డాక్టర్ యువ అన్వేష్ బృందం అర టన్ను కుళ్లిన మాంసం సీజ్, వ్యాపారులకు కఠిన హెచ్చరిక

+

News18

మటన్ కొంటున్నారా? అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. తాజాగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు అధికారులనే కాకుండా స్థానికులను కూడా షాక్‌కు గురిచేశాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఉదయం 28వ వార్డులోని పెద్ద పీర్ల చావడి ప్రాంతంలోని మటన్ మార్కెట్‌పై హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలలు, కాళ్లు, ఇతర మాంసపు భాగాలను చాలా రోజులుగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల మాంసం పూర్తిగా కుళ్లిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని తెలిపారు.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కొన్ని మాంసపు భాగాలను ఫ్రీజర్ల నుంచి బయటకు తీయడానికి సిబ్బంది ఇనుప చువ్వలను ఉపయోగించాల్సి వచ్చింది.

అధికారులు దాదాపు అర టన్ను మేర కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదంగా మారే అవకాశం ఉన్న ఈ మాంసాన్ని వెంటనే సీజ్ చేసి విక్రయాలను అడ్డుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తెలిపారు. మార్కెట్ పరిసరాల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొని ఉండటాన్ని కూడా అధికారులు గుర్తించారు. వ్యాపారులు పరిశుభ్రత నిబంధనలు పాటించాలని, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

సీజ్ చేసిన మాంసంపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి కంపోస్ట్ యార్డుకు తరలించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వస్తే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని తేల్చిచెప్పారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో శానిటరీ సూపర్‌వైజర్ చెంచయ్య, మేస్త్రీలు, వార్డు కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, మాంసాహారం కొనుగోలు చేసే ముందు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *