Last Updated:
అయోధ్య రామాలయం కానుకల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా 105 సార్లు సిబ్బంది దొంగతనాలకు పాల్పడినట్లు సీసీటీవీల్లో రికార్డైంది. సెప్టెంబర్ 25లోగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దర్యాప్తు బృందం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. దేవుడికి భక్తితో ఇచ్చిన సొమ్మును లెక్కింపు సిబ్బంది అత్యంత పకడ్బందీగా కొల్లగొట్టారు. ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25లోగా అవినీతి నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిట్ (SIT) సుప్రీంకోర్టుకు తెలిపినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఈ కీలక విషయాలు వెల్లడించారు.
తొలి అరెస్టు జరిగి 90 రోజులు గడుస్తున్నందున, నిందితులు బెయిల్‌పై బయటకు రాకుండా గడువులోగా ఛార్జిషీట్ వేయడం అత్యంత కీలకంగా మారింది. నేరాన్ని నిరూపించేందుకు సిట్ వద్ద తగినన్ని ఎలక్ట్రానిక్, డాక్యుమెంటరీ ఆధారాలు పక్కాగా ఉన్నాయని తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. దేవుడి సొమ్మును కాజేసిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
దర్యాప్తు పురోగతి నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇందులో సీసీటీవీ ఫుటేజీలు అత్యంత కీలక సాక్ష్యాలుగా మారాయి. కానుకలు లెక్కించే గదిలో సిబ్బంది నగదును తమ బట్టలు, జేబులు, బూట్లలో దాచుకుంటున్న దృశ్యాలు ఏకంగా 105 సార్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. భక్తులు ఇచ్చిన విలువైన ఆభరణాలను సాఫ్ట్‌వేర్ ద్వారా రసీదులు సృష్టించి ఎస్‌బీఐ లాకర్లలో దాచినట్లు సిట్ గుర్తించింది.
ఈ భారీ చోరీకి సంబంధించి జూన్ 25న సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఎనిమిది మంది లెక్కింపు సిబ్బందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లాతో పాటు అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రాతో కలిపి మరో ఏడుగురు విచారణలో అడ్డంగా బుక్కయ్యారు.
వీరంతా ప్రస్తుతం అయోధ్య జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వీరి జ్యుడీషియల్ కస్టడీని అవినీతి నిరోధక కోర్టు ఇటీవల సెప్టెంబర్ 21 వరకు పొడిగించింది. ఆలయ ట్రస్ట్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన యూపీ ప్రభుత్వ సిట్ దర్యాప్తును వేగవంతం చేసి సాక్ష్యాలు సేకరించింది. ఛార్జిషీట్ దాఖలైన వెంటనే నిందితులపై కోర్టు కఠిన చర్యలు తీసుకోనుంది.














