Last Updated:
రాష్ట్రాన్ని ఒక కదుపు కుదిపేసిన షాబాద్ ఆరుగురి హత్య ఘటనలో పోలీస్ స్టేషన్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
షాబాద్‌లో ఆరుగురి దారుణ హత్య, నిందితుడి ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సున్నితమైన కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరిపాలనాపరమైన కారణాలను చూపుతూ ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న షాబాద్ పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్‌హెచ్‌వోను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. షాబాద్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా డీకే లక్ష్మిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు వ్యవహారంలో గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డిపై ఉన్నతాధికారులు కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన బదిలీ తర్వాత కొద్ది రోజులుగా ఈ కీలక పోస్టు ఖాళీగా ఉంది. ఈ స్థానంలో సమర్థవంతమైన అధికారి అవసరం ఉండటంతో తాజాగా లక్ష్మిరెడ్డిని ఎంపిక చేసి ఆ స్థానంలో నియమించారు.
ఈ ఘోర ఘటన జరిగిన వెంటనే పోలీసుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించి సమగ్ర అంతర్గత విచారణకు ఆదేశించారు. విధుల నిర్వహణలో, సకాలంలో స్పందించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉందన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ అంతర్గత విచారణ నివేదిక ఆధారంగా ఇప్పటికే సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేశారు. అలాగే కేసు తీవ్రతను పసిగట్టడంలో విఫలమైన ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డికి ఉన్నతాధికారులు ఛార్జ్ మెమో జారీ చేసి, స్టేషన్ బాధ్యతల నుంచి తప్పించారు.
అసలేం జరిగిందంటే.. జూలై 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నగర శివార్లలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. తనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారన్న తీవ్ర కక్షతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నాయనమ్మలను లక్ష్యంగా చేసుకుని దారుణంగా నరికి చంపాడు. ఈ మూడు హత్యలతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది.
ఆ ముగ్గురిని అత్యంత క్రూరంగా హత్య చేసిన అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ నేరుగా తన సొంత ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏ పాపం ఎరుగని తన సొంత భార్యతో పాటు ఇద్దరు పసిపిల్లలను సైతం అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఒకే రాత్రి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఈ నెత్తుటి ఉదంతం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆరోపిస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
ప్రజల నుంచి వచ్చిన ఈ తీవ్ర విమర్శల నేపథ్యంలోనే పోలీస్ బాస్ తాజా బదిలీల అస్త్రం ప్రయోగించారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచే దిశగా ఈ తాజా మార్పులు చేశారు. ఈ ప్రక్షాళనలో భాగంగా షాబాద్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ అధికారులను మార్చారు. చేవెళ్ల ఎస్‌హెచ్‌వోగా కె. నరేందర్ రెడ్డికి నూతన పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ) విభాగానికి ఎం. భూపాల్ శ్రీధర్‌ను బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Hyderabad,Telangana
July 24, 2026 1:20 PM IST














