Last Updated:
జూపల్లి కృష్ణారావు శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు, తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు
హైదరాబాద్లోని గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ, తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు.
అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి, శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తిపై ఉన్న స్పష్టమైన నిబంధనలను గుర్తుచేశారు. కనిష్ట నీటి మట్టం 834 అడుగులకు చేరుకున్న తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేపట్టకూడదని ఉన్నా, వాటిని పక్కనపెట్టి ఏపీ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ సర్కార్ నీటిని వినియోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన జూపల్లి, పలుమార్లు విన్నవించినా కూడా ఏపీ ప్రభుత్వం తన మొండివైఖరిని మార్చుకోలేదని విమర్శించారు. ఈ చర్యలు తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు, కృష్ణా పరివాహక ప్రాంత ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులంతా ఏకమై శ్రీశైలం వద్ద ‘వంటా-వార్పు’ కార్యక్రమానికి పిలుపునిచ్చామని మంత్రి వెల్లడించారు. తమ హెచ్చరికల తీవ్రతను గమనించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని తెలిపారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యమని స్పష్టం చేసిన మంత్రి, పాలమూరు ప్రాంతానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి పోరాడుతుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి వాటాల విషయంలో గతంలో కూడా తెలంగాణ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు తాము ఆందోళనలు నిర్వహించామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయించామని ఆయన గుర్తుచేశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేస్తూ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు.
Wanaparthy,Mahbubnagar,Telangana












