తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి మహానాడు ప్రసంగంలో నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా, రాకపోయినా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. మహిళలు, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తూ కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
2. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు?:
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ హామీ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌కు దక్కే మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి షర్మిల పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీకే హరిప్రసాద్, రాజీవ్ గౌడ, పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటే పేర్లతో పాటు షర్మిల పేరు కూడా చర్చలో ఉంది. ఇదే సమయంలో పరిమళ్ నత్వానీ ఝార్ఖండ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
3. రూ.1,000 కోట్ల విలువైన భూమిని కాపాడండి:
శంషాబాద్ పెద్దషాపూర్‌లో రూ.1,000 కోట్ల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. ఒకే భూమిపై ఆర్డీవో, తహసీల్దార్ విభిన్న అఫిడవిట్‌లు ఇవ్వడంపై సిట్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి్ సన్నిహితుల ప్రమేయం ఉందనీ, భూమిని మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చాలని కోరారు.
4. పాలనలో దూకుడు చూపిస్తాం:
తెలుగుదేశం పార్టీ మహానాడులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ టీడీపీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని అన్నారు. పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అనీ, బీజేపీ-జనసేనతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కూటమిగా పనిచేస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు తెలిపారు.
5. హైదరాబాద్ అరుదైన ఘనత:
భారత్ డేటా సెంటర్ మార్కెట్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1.6 గిగావాట్ల సామర్థ్యం ఉండగా, మరో 3.1 గిగావాట్లు నిర్మాణం, ప్రణాళిక దశల్లో ఉన్నాయని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఏఐ వినియోగం, క్లౌడ్ సేవల విస్తరణతో ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు డిజిటల్ హబ్‌లుగా మారుతున్నాయి. ప్రపంచ డేటా సెంటర్ మార్కెట్‌లో హైదరాబాద్ 9వ స్థానంలో నిలవగా, భవిష్యత్ అవసరాల కోసం 10.5 గిగావాట్లకు పైగా సామర్థ్యానికి భూములు సిద్ధంగా ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది.
6. సిద్ధరామయ్య రాజీనామా ఖాయం?:
కర్ణాటక కొత్త సీఎం రేసులో డీకే శివకుమార్‌తో పాటు హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సిద్ధరామయ్య రాజీనామా చేసినా సీఎం పదవిని అహింద వర్గాలకు చెందిన నేతకే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం. అధిష్ఠానం అంగీకరిస్తే దళిత నేత జి.పరమేశ్వరకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవి తనకే ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మనసులు నొప్పించకుండా అధిష్ఠానం వ్యవహరిస్తున్నట్లు సమాచారం. రేపు ఇద్దరు నేతల సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడనున్న తరుణంలో సీఎం మార్పుపై స్పష్టత వచ్చే అవకాశముంది.
7. రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్ కాదు:
‘డాన్ 3’ సినిమా నుంచి రణ్‌వీర్ సింగ్ వైదొలగిన వ్యవహారంపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ స్పందించింది. ఆయనపై మూడేళ్ల బ్యాన్ విధించలేదనీ, నటులపై నిషేధం విధించే అధికారం తమకు లేదని అశోక్ పండిట్ స్పష్టం చేశారు. నిర్మాతలకు రూ.45 కోట్ల ప్రీ ప్రొడక్షన్ నష్టం జరిగిన కారణంగా సమస్య పరిష్కారం అయ్యే వరకూ రణ్‌వీర్‌తో కలిసి పని చేయవద్దని సభ్యులకు సూచించినట్లు తెలిపారు. దర్శకుడు లేదా నటుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా నిర్మాతలకే ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు.
8. ఇండస్ట్రీ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది:
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడమే సినీ పరిశ్రమ ముందున్న పెద్ద సవాల్ అన్నారు. ‘సమ్మర్ హాలీడేస్’లాంటి మంచి చిన్న సినిమాలు వస్తే ఇండస్ట్రీ నిలబడుతుందని తెలిపారు. కొత్త దర్శకులు మంచి చిత్రాలు తీసి సినీ పరిశ్రమకు కొత్త ఊపునివ్వాలని, ఈ సినిమాతో థియేటర్లలో మళ్లీ సందడి నెలకొనాలని ఆకాంక్షించారు.
9. పాక్ మధ్యవర్తిత్వమే పెద్ద సమస్య:
పాకిస్థాన్ ఇజ్రాయెల్‌పై విద్వేషంతో ఉందని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్-అమెరికా శాంతి చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం చేయడమే పెద్ద సమస్య అన్నారు. అబ్రహాం ఒప్పందాలపై పాక్ వైఖరిని ప్రశ్నిస్తూ, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఆందోళనకరమన్నారు. ఇరాన్ సైనిక విమానాలు పాక్ ఎయిర్‌బేస్‌లలో ఉన్నాయన్న వార్తలను కూడా పూర్తిగా ఖండించలేమని వ్యాఖ్యానించారు.
10. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా:
పశ్చిమాసియాలో శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా ఇరాన్‌పై భారీ దాడులకు దిగింది. క్షిపణి స్థావరాలు, సముద్రంలోని మందుపాతర పడవలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. బందర్ అబ్బాస్ నౌకాదళ స్థావరం ధ్వంసమై, ఇరాన్‌లో పలువురు సైనికులు మృతిచెందినట్లు సమాచారం. ఇదే సమయంలో హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేయగా, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తూ ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.












