రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్‌లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్‌లో.. | తెలంగాణ వార్తలు | ACTPnews

రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్‌లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్‌లో..


Last Updated:

మీరూ జాబ్ కోసం వేరే ఊరికి వెళ్తున్నారా? అయితే ఈ యువకుడికి ఎదురైన చేదు అనుభవం మీకో గుణపాఠం!

రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్‌లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్‌లో..
రూ.14 వేలు ఖర్చుపెట్టి ఫ్లైట్‌లో వస్తే.. 10 నిమిషాల్లోనే గెంటేశారు, హైదరాబాద్‌లో..

ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ఒక్కోసారి ఎదురయ్యే అనుభవాలు తీవ్ర నిరాశకు గురిచేస్తుంటాయి. ఉన్న ఊరిని విడిచి, మంచి ఉద్యోగం సాధించాలనే తపనతో ఎంతో కష్టపడి సుదూర ప్రాంతాలకు వెళ్లినా, కొన్ని కంపెనీల వ్యవహారశైలి అభ్యర్థులకు తీవ్ర మనస్తాపం మిగులుస్తోంది. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూ కోసం ఏకంగా రూ.14 వేలు ఖర్చు పెట్టి విమానంలో వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక ఆ కంపెనీ ప్రతినిధులు కేవలం పది నిమిషాల్లోనే ఇంటర్వ్యూ ముగించి అతడిని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. ఈ చేదు అనుభవాన్ని సదరు అభ్యర్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడిట్’ వేదికగా పంచుకోవడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సియాసాత్ కథనం ప్రకారం.. బాధిత యువకుడు పారిశ్రామిక ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) రంగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఒక బహుళజాతి ఫార్మా కంపెనీలో ఫెర్మెంటేషన్ విభాగానికి సంబంధించిన అత్యుత్తమ ఉద్యోగానికి అతడి ప్రొఫైల్ షార్ట్‌లిస్ట్ అయింది. కంపెనీ ప్రతినిధులు తన బయోడేటా, పని అనుభవం పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఇంటర్వ్యూకు పిలిచి ఉంటారని అతడు గట్టిగా నమ్మాడు. అందుకే ఇంటర్వ్యూ కోసం చాలా రోజులు కష్టపడి రాత్రింబవళ్లు ప్రిపేర్ అయ్యాడు. తాను పనిచేస్తున్న ఆఫీసులో సెలవు పెట్టి, విమాన టిక్కెట్లకు వేలాది రూపాయలు వెచ్చించి ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లాక ఎదురైన వింత పరిస్థితి అతడిని తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఇది కూడా చదవండి: PMAY: ఇకపై వారి అకౌంట్లలోకి రూ.2 లక్షల 39 వేలు.. ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి చేరుకున్న తర్వాత అతడికి ఊహించని వింత అనుభవం ఎదురైంది. తనకంటే ముందు వేరే అభ్యర్థులను లోపలికి పిలవడాన్ని అతడు గమనించాడు. మిగతా వారితో చాలా సేపు ముఖాముఖి మాట్లాడిన హెచ్‌ఆర్ బృందం.. ఇతడి వంతు వచ్చేసరికి కేవలం పది నిమిషాల్లోనే మమ అనిపించింది. ఇంటర్వ్యూ ప్యానెల్ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను చాలా స్పష్టంగా, సరైన సమాధానాలు చెప్పినట్లు యువకుడు వాపోయాడు. కానీ తనకున్న అపారమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పూర్తిగా వివరించే అవకాశం వారు ఏమాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తన కోర్ సబ్జెక్టుపై ఎలాంటి లోతైన చర్చ జరగలేదని స్పష్టం చేశాడు.

ఇది కూడా చదవండి: Shukra Gochar: జూన్ 8 తర్వాత ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఉద్యోగం, డబ్బు, కీర్తి.. తిరుగులేని అదృష్టం!

ఇంటర్వ్యూ పూర్తవ్వక ముందే తనను పక్కన పెట్టాలని కంపెనీ యాజమాన్యం ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చేసిందనే అనుమానాన్ని అతడు వ్యక్తం చేశాడు. కేవలం ఫార్మాలిటీ కోసమే తనను పిలిచారని, బహుశా ముందే అనుకున్న వారికి ఉద్యోగం ఇచ్చేశారేమో అని ఆరోపించాడు. తన ప్రొఫైల్ ఆ ఉద్యోగానికి సరిపోనప్పుడు అసలు తనను ఎందుకు షార్ట్‌లిస్ట్ చేశారని సదరు అభ్యర్థి సూటిగా ప్రశ్నించాడు. వృథా అయిన తన సమయం, కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరు తిరిగి ఇస్తారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో అమాయక అభ్యర్థుల పట్ల కార్పొరేట్ కంపెనీల బాధ్యతారాహిత్యం మరోసారి బట్టబయలైంది.

రెడిట్‌లో ఈ బాధిత యువకుడు పంచుకున్న పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు అతడికి భారీగా తమ మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల విలువైన సమయాన్ని, డబ్బును ఇలా వృథా చేయడం దారుణమని మండిపడుతున్నారు. కంపెనీలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు చేసే సదుపాయం ఉన్నప్పటికీ ఇలా సుదూర ప్రాంతాల నుంచి అభ్యర్థులను పిలిపించి అవమానించడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. ఫస్ట్ రౌండ్ ఆన్‌లైన్‌లో నిర్వహించి, అందులో షార్ట్‌లిస్ట్ అయిన అర్హులను మాత్రమే ఫైనల్ రౌండ్ కోసం నేరుగా పిలిస్తే నిరుద్యోగులకు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని పలువురు నిపుణులు సైతం కంపెనీలకు హితవు పలుకుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed