తెలంగాణలో చమురు సరఫరాపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సీజీఓ టవర్స్‌లో చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్‌తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరియు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్లే ప్రజలు ఆందోళనతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని, ఇది కృత్రిమ కొరతకు దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.












