Last Updated:
తిరుమల బ్రహ్మోత్సవాల తర్వాత సెప్టెంబర్ 24-26 వరకు భాగ్ సవారి, అనంత పద్మనాభ వ్రతం, పౌర్ణమి గరుడసేవ జరగనున్నాయి. ఈ మూడు రోజులు తిరుమలలో ఆధ్యాత్మిక సందడి కొనసాగనుంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసినా.. భక్తులకు మరో మూడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు భాగ్ సవారి ఉత్సవం, అనంత పద్మనాభ వ్రతం, పౌర్ణమి గరుడసేవ జరగనున్నాయి. దీంతో ఈ మూడు రోజులు తిరుమలలో ఆధ్యాత్మిక సందడి కొనసాగనుంది. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం తిరుమలలో భాగ్ సవారి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతాళ్వారు తోటకు వేంచేయనున్నారు. బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజున భాగ్ సవారి ఉత్సవాన్ని నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీగా వస్తోంది.
సెప్టెంబర్ 25వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా స్వామివారి పుష్కరిణి వద్దకు తీసుకెళ్లనున్నారు. అక్కడ అర్చకులు ఆగమోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం సుదర్శన చక్రత్తాళ్వారుకు అభిషేకాదులు చేసి చక్రస్నానం చేయిస్తారు.
చక్రస్నానం అనంతరం సుదర్శన చక్రత్తాళ్వారును తిరిగి శ్రీవారి ఆలయానికి వేంచేయనున్నారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాల్లో భక్తులు స్వామివారి సేవను దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీంతో అనంత పద్మనాభ వ్రతం రోజున కూడా తిరుమలలో భక్తుల సందడి కనిపించనుంది.
ఇక సెప్టెంబర్ 26వ తేదీన తిరుమలలో పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ సేవలో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులు వెదజల్లే గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మొత్తంగా సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు తిరుమలలో వరుసగా మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి గరుడసేవలో గరుడ వాహనంపై శ్రీవారి దివ్యదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలిరానున్నారు.














