Last Updated:
నాని- శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబోలో నేడే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ది ప్యారడైజ్. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి నుంచే దేశవిదేశాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు, ప్రీమియర్ షోలకు వచ్చిన అనూహ్య స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. తొలిరోజే ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అవలీలగా అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల నుంచి ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందానికి ప్రశంసల వెల్లువ మొదలైంది. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా నాని అండ్ టీమ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. “మై డియర్ నాని.. కొత్తదనాన్ని అన్వేషించడంలో నీకున్న ఉత్సాహం, అంకితభావం, తపనను చూడటం ఎప్పుడూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ‘దసరా’ చిత్రంలో నువ్వు, శ్రీకాంత్ ఓదెల చూపించిన ప్యాషన్, సంకల్పాన్ని చూసిన తర్వాత.. మీరిద్దరూ కలిసి ‘ది ప్యారడైజ్’ ద్వారా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి మళ్లీ రావడం ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని వెండితెరపై వీక్షించేందుకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
My dear @nameisnani, it is always wonderful to see your enthusiasm, sincerity and hunger to explore something new.
After witnessing the passion and conviction you and Srikanth brought to #Dasara, it is exciting to see you both come together once again with an entirely new world…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 23, 2026
అలాగే చిత్ర యూనిట్‌కు తన ఆశీస్సులు అందజేస్తూ.. “హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి (ఎస్ఎల్వీ సినిమాస్), సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక ఆశీస్సులు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పి, మీ అందరికీ చిరస్మరణీయమైన పండుగ లాంటి విజయాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను” అని మెగాస్టార్ దీవించారు. రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన అదిరిపోయే సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని, శ్రీకాంత్ ఓదెల రా అండ్ రస్టిక్ మేకింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతోందని ఇండస్ట్రీ టాక్.
ఇదిలా ఉండగా.. నాని, చిరంజీవి అభిమానులకు మరో అదిరిపోయే అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నాని తన సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మెగా ప్రాజెక్టుకు కూడా శ్రీకాంత్ ఓదెలానే దర్శకత్వం వహించనున్నారని విశ్వసనీయ సమాచారం. ఒకవైపు ‘ది ప్యారడైజ్’ సక్సెస్, మరోవైపు చిరంజీవితో కొత్త సినిమా వార్తలతో నాని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.














