Last Updated:
Sleeper Bus Catches Fire: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది.
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు స్లీపర్ టూరిస్ట్ బస్సులో ఆకస్మికంగా భారీగా మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తీవ్రంగా మారింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. సుమారు 40 మందికి పైగా ప్రయాణికులతో కూడిన స్లీపర్ బస్సు దేశ రాజధాని దిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా వైపు బయలుదేరింది. తెల్లవారుజామున గ్రేటర్ నోయిడా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఆ మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి.
ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు అప్రమత్తమై కిటికీల అద్దాలు పగులగొట్టి, తలుపుల గుండా బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే, లోపల గాఢ నిద్రలో ఉండిపోయిన 9 మంది బయటపడలేక మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. తమ కళ్లముందే బస్సు దగ్ధమవుతుండటం, లోపల ఉన్నవారి ఆర్తనాదాలు, ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళాలు, అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘోర ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం సత్వరమే అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
బస్సులో మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, షార్ట్ సర్క్యూట్ కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














