PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’కు 12 ఏళ్లు పూర్తి.. రక్షణ రంగం నుంచి మొబైల్ తయారీ వరకు భారత్ అద్భుత ప్రగతి! | | ACTPnews

News18


Last Updated:

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అన్ని రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతి గణాంకాలను ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు.

News18
News18

భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతంగా 12 వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశంలోని అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రశంసించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోతో పాటు కీలక గణాంకాలను ఆయన పంచుకున్నారు. మేక్ ఇన్ ఇండియా వల్ల దేశీయంగా వస్తువుల తయారీ పెరగడమే కాకుండా, భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని, ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని మోదీ స్పష్టం చేశారు.

రక్షణ రంగంలో ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని గర్వంగా ప్రకటించారు. 2014లో కేవలం రూ.690 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు, గత పన్నెండేళ్లలో ఏకంగా 5,500 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.38,400 కోట్లకు చేరుకోవడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాల ద్వారా ఎగుమతుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి భారీ విస్తరణ జరిగిందని ప్రధాని వివరించారు. ఈ పథకాల కింద ఉత్పత్తి, అమ్మకాల విలువ రూ.23.8 లక్షల కోట్లకు చేరగా, ఎగుమతుల ద్వారా రూ.15.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఒకప్పుడు విదేశీ దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించింది. ప్రస్తుతం దేశంలో ప్రజలు వాడుతున్న మొబైల్ ఫోన్లలో ఏకంగా 99.2 శాతం ఫోన్లు మన దేశంలోనే తయారవుతుండటం విశేషం.

మౌలిక సదుపాయాల కల్పన, కొత్త పరిశ్రమల స్థాపన, వినూత్న ఆవిష్కరణల సమాహారమే మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ మూడు అంశాలే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ, అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ను ప్రధాన గమ్యస్థానంగా మార్చడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో తయారీ రంగంలో భారత్ మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని కేంద్రం ధీమా వ్యక్తం చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed