Last Updated:
మత్తు పదార్థాలు తీసుకున్న పైలట్‌ను విధుల నుంచి తొలగించిన ఘటన మరువకముందే ఎయిర్ ఇండియాలో మరో వివాదం వెలుగుచూసింది. జ్యూరిచ్ ఎయిర్‌పోర్టులో ఆల్కహాల్ టెస్టులో పాజిటివ్ రావడంతో ఓ కో-పైలట్‌ను యాజమాన్యం తక్షణమే సస్పెండ్ చేసింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో పైలట్ల ప్రవర్తన మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మత్తు పదార్థాలు తీసుకున్న కారణంగా ఓ పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన నెల రోజుల్లోనే మరో కో-పైలట్ మద్యం తాగి పట్టుబడ్డాడు. సెప్టెంబర్ 6న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ రావాల్సిన ఏఐ 151 (AI 151) విమానాన్ని నడిపేందుకు సిద్ధమైన కో-పైలట్‌పై అక్కడి అధికారులకు అనుమానం కలిగింది. వెంటనే అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం తాగినట్లు ప్రాథమిక నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అతడిని విమానం నడపకుండా అడ్డుకుని సాధారణ ప్రయాణికుడిలా భారత్‌కు తిప్పి పంపించారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం తుది మెడికల్ రిపోర్ట్ వచ్చేవరకు సదరు కో-పైలట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిందని న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. పైలట్ అందుబాటులో లేకపోవడంతో ఆ రోజు బయలుదేరాల్సిన విమానం రద్దయి మరుసటి రోజు ఢిల్లీకి చేరుకుంది.
ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. విమాన సిబ్బంది అందరూ భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
గత ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం ఒడిశా గగనతలంలో ఒక్కసారిగా 300 అడుగుల కిందకు పడిపోయిన ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఆ విమాన పైలట్ సుదీప్ వశిష్టకు నిర్వహించిన రెండు పరీక్షల్లో గంజాయి తీసుకున్నట్లు తేలడంతో అతడిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించారు. నిద్ర పట్టకపోవడంతో మందులు వాడానని అతడు చెప్పినప్పటికీ యాజమాన్యం కనికరించలేదు.
వరుస ఘటనల నేపథ్యంలో ఎయిర్ ఇండియా తమ పైలట్లకు డ్రగ్ టెస్టులను తప్పనిసరి చేసింది. సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు విమాన కార్యకలాపాల్లో పాల్గొనే ఉద్యోగుల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచుతామని సంస్థ వెల్లడించింది.














