Last Updated:
బిగ్‌బాస్ 10 రియాలిటీ షో రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా హౌస్ లోకి అపూర్వ ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి.
బిగ్‌బాస్ 10 రియాలిటీ షో రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో మూడో వారం ‘టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ నడుస్తోంది. ఈ వారం ఆరంభం నుంచే రకరకాల టాస్క్‌లతో ఇంటి సభ్యులకు చుక్కలు చూపించిన బిగ్‌బాస్.. తాజాగా వాళ్లకు మరో పెద్ద షాక్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి హౌస్‌లో వాతావరణాన్ని అమాంతం వేడెక్కించాడు. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోను స్టార్ మా నిర్వాహకులు విడుదల చేశారు.
నిన్నటి ఎపిసోడ్ వరకు ‘అగ్నిపరీక్ష’ దశలో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలు బిగ్‌బాస్ గేటు వద్దకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ముగ్గురిలో హౌస్‌లోకి ఎవరిని పంపించాలనుకుంటున్నారో ఓటు వేయాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను కోరాడు. సభ్యులంతా తమకు నచ్చిన వారికి ఓట్లు వేశారు. ఇక్కడే బిగ్‌బాస్ తన మార్క్ మైండ్ గేమ్ ఆడాడు. “ఇది టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ వారం.. కాబట్టి మీరు ఎవరికైతే అతి తక్కువ ఓట్లు వేశారో.. వారిని మీకు టెన్షన్ పుట్టించడానికి హౌస్‌లోకి పంపిస్తున్నాను” అని బాంబు పేల్చాడు. దీంతో సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ అపూర్వ కావడంతో ఆమె హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. “యువర్ క్వీన్ ఈజ్ బ్యాక్.. అమ్మ నీ పులి బిడ్డ హౌస్‌లోకి ఎంటర్ అవుతుంది” అంటూ అపూర్వ చెప్పిన మాస్ డైలాగ్ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.
అపూర్వ రాకను చూసి సృష్టి, రోహిత్ సంతోషంతో హగ్ చేసుకోగా.. షాలిని ముఖంలో మాత్రం స్పష్టంగా జెలసీ కనిపించింది. పైకి నవ్వుతూ పలకరించినప్పటికీ లోపల మాత్రం రగిలిపోయినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అపూర్వ నేరుగా రోహిత్ దగ్గరకు వెళ్లి “నాకు ఇల్లు చూపించవా” అని అడగడం, దానికి అమన్ తదితరులు రోహిత్‌పై సెటైర్లు వేయడం నవ్వులు పూయించింది. వారు అలా ఇల్లు చూస్తుండగానే బిగ్‌బాస్ వర్షం సినిమాలోని ‘మెల్లగా కరగనీ’ అనే రొమాంటిక్ పాటను ప్లే చేశాడు. ఆ తర్వాత ముకేశ్.. అగ్నిపరీక్షలో మీరు చేసిన డ్యాన్స్ మేము చూడలేదు, ఇప్పుడు వేయండి అని అడగడంతో రోహిత్, అపూర్వ కలిసి డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ చూస్తూ కిచెన్ నుంచి షాలిని కుళ్లుకోవడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది.
వాస్తవానికి అగ్నిపరీక్ష టాస్క్ నుంచే షాలిని, అపూర్వలకు అస్సలు పడటం లేదు. ఇద్దరూ బద్ధ శత్రువుల్లా ఢీ అంటే ఢీ అనుకున్నారు. ఇక రోహిత్-అపూర్వ పెయిర్ అగ్నిపరీక్షలో మంచి మార్కులు కొట్టేసింది. కానీ అపూర్వ లేని సమయంలో హౌస్‌లో షాలిని, రోహిత్‌కి బాగా దగ్గరైంది. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ కూడా వచ్చింది. ఈ తరుణంలో అపూర్వ రావడంతో రోహిత్ ఈ ఇద్దరి మధ్య నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు హౌస్‌లో కామెడీ ట్రాక్ కూడా పేలింది. పగటి పూట హాయిగా నిద్రపోతున్న నరేశ్‌ను బిగ్‌బాస్ పేరు పెట్టి పిలవడంతో అతను ఉలిక్కిపడి లేచాడు. బిగ్‌బాస్ కౌంటర్లకు సభ్యులంతా పడి పడి నవ్వారు. కెప్టెన్ ఝాన్సీ వెంటనే నరేశ్‌కు 20 గుంజీలు తీయాలని పనిష్మెంట్ ఇచ్చింది. గుంజీలు తీశాక బిగ్‌బాస్ “నిద్ర తీరిపోయిందా” అని అడగగా, “మరో 5 నిమిషాలు పడుకుంటా బిగ్‌బాస్” అని నరేశ్ అమాయకంగా అడగడం, దానికి రాంప్రసాద్ “సిగ్గుండాలిరా” అని కౌంటర్ వేయడం నవ్వులు పూయించింది. మొత్తానికి అపూర్వ రాకతో హౌస్‌లో సమీకరణాలు ఎలా మారతాయో చూడాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.














