Last Updated:
తాజాగా 19వ రోజు (శుక్రవారం, సెప్టెంబర్ 25) ఎపిసోడ్లో అగ్నిపరీక్ష ఎదుర్కొన్న అపూర్వ, మిథిలేష్ ఎంట్రీతో హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి పోతే..
బిగ్‌బాస్ హౌస్ అంటేనే వివాదాలు, అనూహ్య మలుపులకు కేరాఫ్ అడ్రస్. కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టి ఎంటర్టైన్మెంట్ రాబట్టడంలో బిగ్‌బాస్ టీమ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా 19వ రోజు (శుక్రవారం, సెప్టెంబర్ 25) ఎపిసోడ్లో అగ్నిపరీక్ష ఎదుర్కొన్న అపూర్వ, మిథిలేష్ ఎంట్రీతో హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హౌస్మేట్స్ అందరూ వద్దనుకుని తక్కువ ఓట్లు వేసినప్పటికీ బిగ్‌బాస్ అపూర్వను ఇంట్లోకి పంపి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఆమె రాకతో షాలినీ, రోహిత్ మధ్య చర్చ మొదలైంది. అపూర్వ రావొద్దని ముఖేష్ నేరుగా కెమెరాల ముందే చెప్పాడని, కానీ ఇప్పుడు ఆమెతో బాగానే ఉంటున్నాడని షాలినీ ఆరోపించింది. త్రిగుణ్ వచ్చి షాలినీని ప్రశ్నించగా, తనకు అపూర్వతో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది.
హౌస్‌లో నిబంధనల ఉల్లంఘనలపై బిగ్‌బాస్ కఠినంగా వ్యవహరించాడు. నరేష్ పగటిపూట నిద్రపోవడంతో హెచ్చరించిన బిగ్‌బాస్, అప్పటి కెప్టెన్ ఝాన్సీ ద్వారా అతడికి గుంజీల శిక్ష వేయించాడు. మరోవైపు ఎంట్రీ కోసం మిథిలేష్, రామకృష్ణలకు సమానంగా ఓట్లు రావడంతో వారిద్దరికీ బిగ్‌బాస్ ‘టైర్ల టాస్క్’ ఇచ్చాడు. ఇందులో విజయం సాధించిన మిథిలేష్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఇంటి పనుల విషయంలో అమన్, త్రిగుణ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. “కెప్టెన్ చెబితేనే వింటాను” అని అమన్ అనడంతో త్రిగుణ్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే, చివరకు త్రిగుణ్ క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
కొత్తగా హౌస్‌లోకి వచ్చిన అపూర్వ, మిథిలేష్‌లకు బిగ్‌బాస్ ఊహించని పవర్ ఇచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్ల నుంచి ఇద్దరిని తప్పించే అవకాశం ఇవ్వగా, మిథిలేష్.. ఝాన్సీని రేసు నుంచి తప్పించాడు. అపూర్వ.. శ్రష్టిని టార్గెట్ చేసింది. శ్రష్టికి సహనం లేదని, గతంలో సుధీర్‌ను చెత్తతో కొట్టి తిట్టిందని కారణాలు చెప్పారు. అలాగే అమన్ కూడా స్క్రీన్ స్పేస్ కోసం అనవసరంగా అరుస్తున్నాడని, అతనికి క్లారిటీ లేదని వారు విమర్శించారు. సామాన్యుల మధ్య చిచ్చుపెట్టడానికే బిగ్‌బాస్ ఈ పవర్ ఇచ్చినట్లు స్పష్టమైంది.
ఎపిసోడ్ చివర్లో కెప్టెన్సీ కోసం ఆసక్తికరమైన గేమ్ జరిగింది. అపూర్వ-ముఖేష్ ఒక జంటగా, ఝాన్సీ-మిథిలేష్ మరో జంటగా పోటీ పడ్డారు. ఈ టాస్క్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అపూర్వ, ముఖేష్ జోడీ విజయం సాధించింది. దీంతో ముఖేష్ హౌస్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా, అపూర్వకు ఇమ్యూనిటీ లభించింది. ఇంట్లోకి వచ్చిన తొలి రోజే అపూర్వ జాక్‌పాట్ కొట్టడం రాబోయే ఎపిసోడ్స్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.














