Last Updated:
Iran-US War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. టెహ్రాన్‌పై వాషింగ్టన్ కనుక మరోసారి ఎలాంటి సైనిక చర్యలకైనా పాల్పడితే, మధ్యప్రాచ్య వ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ ప్రయోజనాలపై భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ భవిష్యత్తు, ప్రాంతీయ వివాదాల తీవ్రత నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ మేరకు ఇరాన్ అగ్రశ్రేణి ఆపరేషనల్ మిలిటరీ కమాండ్ ‘ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్’ ఒక ప్రకటన విడుదల చేసింది. టెహ్రాన్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ ఏ చిన్న తప్పు చేసినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ప్రాంతంలో అమెరికాకు చెందిన అన్ని సైనిక స్థావరాలను నిర్దిష్టంగా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సెమీ-అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్ (Mehr) వెల్లడించింది. అంతేకాకుండా, అమెరికా చేపట్టే సైనిక చర్యలకు సహకరించే దేశాలను కూడా ఈ యుద్ధంలో భాగస్వాములుగానే పరిగణిస్తామని ఖాతం అల్-అన్బియా కమాండ్ గతంలోనే హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేసింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా దౌత్యపరమైన సంప్రదింపులు జరుగుతున్న వేళ, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. వాషింగ్టన్ కొన్ని షరతులకు అంగీకరిస్తే.. ఏడు రోజుల్లోగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, అలాగే అణు చర్చలను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఈ ప్రతిపాదన ప్రకారం.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నావికా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) అమెరికా ఎత్తివేయాలి, ఆంక్షలను సడలించాలి మరియు కాల్పుల విరమణను పాటించాలి. అంతర్జాతీయంగా చమురు, సహజవాయువు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకా రవాణాను పునరుద్ధరించడానికి ఇరువైపులా చర్యలు అవసరమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనపై అమెరికా నుంచి అధికారిక స్పందన కోసం టెహ్రాన్ ఎదురుచూస్తోంది.
అయితే, ఇరాన్ చేసిన ఈ దౌత్య ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. అమెరికా ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌పై తిరిగి వైమానిక బాంబు దాడులు ప్రారంభమయ్యే అవకాశముందని ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు పత్రిక వెల్లడించింది. బహిరంగంగా ఇరాన్ రాజీకి సిద్ధపడుతోందని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా విధించే షరతులను టెహ్రాన్ పాటిస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన భావిస్తున్నారు.














