Actor: 43 ఏళ్లకే ప్రముఖ నటుడు మృతి.. భరించలేని బాధను అనుభవిస్తున్నానంటూ పోస్ట్ పెట్టి మరీ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రముఖ ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఆర్నాడ్ డేనిస్ 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

News18
News18

ప్రముఖ ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఆర్నాడ్ డేనిస్ 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హెర్నియా చికిత్స కోసం చేయించుకున్న శస్త్రచికిత్స అనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో చివరకు వైద్యులను సంప్రదించి కారుణ్య మరణానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. కారుణ్య మరణం (Euthanasia) అంటే తీవ్రమైన, నయం కాని అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి.. వైద్యుల సహాయంతో చట్టబద్ధమైన వైద్య ప్రక్రియ ద్వారా తన జీవితాన్ని ముగించుకోవడం అనే అర్థం వస్తుంది.

మరణానికి ముందు ఆర్నాడ్ డేనిస్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్టును కూడా షేర్ చేశారు. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, గత మూడేళ్లుగా భరించలేని బాధను అనుభవిస్తున్నానని ఆర్నాడ్ డేనిస్ తన పోస్టులో పేర్కొన్నారు. కండరాల్లో బలం పూర్తిగా తగ్గిపోయిందని, ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యం కూడా కోల్పోయానని తెలిపారు.

తన పరిస్థితి నరకప్రాయంగా మారిందని, ఇక ఆ బాధను భరించే శక్తి తనకు లేదని పేర్కొంటూ జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ కఠిన సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే తన నిర్ణయం ఇతరులకు ఎలాంటి ప్రేరణగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్య సమస్యపై ప్రజలకు అవగాహన కలగడంతో పాటు.. భవిష్యత్తులో వైద్యులు ఈ వ్యాధిపై మరింత పరిశోధనలు చేసి మెరుగైన చికిత్సా మార్గాలను కనుగొనాలని ఆకాంక్షించారు.

ఆర్నాడ్ డేనిస్ 2023లో హెర్నియా సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ (ME) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్రమైన బలహీనత, కండరాల సమస్యలు సహా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో పోరాడిన అనంతరం చివరకు ఆర్నాడ్ డేనిస్ కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు.

ఆర్నాడ్ డేనిస్ తన కెరీర్‌ను చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. కేవలం 20 ఏళ్ల వయసులో ‘లే కొంపానియన్స్ డి లా చిమేర్’ అనే థియేటర్ కంపెనీని స్థాపించారు. రంగస్థల నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన మోలియర్ అవార్డుల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ షో అవార్డులను అందుకున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వైవ్స్ సెయింట్ లారెంట్’, ‘లా మౌయెట్’, ‘వివ్రే’, ‘లావోకాట్’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే ‘నెపోలియన్’, ‘ఎల్లెస్ ఎట్ మోయూ’, ‘కాండిస్ రెనోయిర్’, ‘బ్లేజ్’ వంటి టెలివిజన్ సిరీస్‌లలోనూ కీలక పాత్రలు పోషించారు. 43 ఏళ్ల వయసులోనే ఆర్నాడ్ డేనిస్ మృతి చెందడం ఫ్రెంచ్ సినీ, రంగస్థల వర్గాల్లో విషాదాన్ని నింపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports