UP Floods: ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. మూడు రోజుల్లో 56 మంది మృతి! | | ACTPnews

News18


Last Updated:

ఉత్తరప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యికి పైగా ఇళ్లు దెబ్బతినగా, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాగల గంటల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News18
News18

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కనీసం 56 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు గోడలు కూలిపోవడం, పిడుగులు పడటం వంటి ఘటనలతో భారీ ప్రాణనష్టం సంభవించింది. యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 107 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,021 నివాస గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సీతాపూర్ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మరణించగా.. లఖింపూర్ ఖేరీ, బహ్రైచ్, బలరాంపూర్ జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అయోధ్య, గోరఖ్‌పూర్ జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. గాయపడిన వారిలో హర్దోయ్ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు ఉండగా.. మెయిన్‌పురి, శ్రావస్తి, బారాబంకి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సీతాపూర్, లఖింపూర్ ఖేరీలలో ముగ్గురు చొప్పున గాయపడ్డారు.

భారీ వర్షాల వల్ల హర్దోయ్ జిల్లాలో అత్యధికంగా 272 ఇళ్లు దెబ్బతినగా, సీతాపూర్‌లో 108, చందౌలీలో 75 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఔరయ్యా, గోండా, హమీర్‌పూర్, షాజహాన్‌పూర్, బహ్రైచ్ జిల్లాల్లోనూ వందలాది ఇళ్లు కూలిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటి భూభాగంపైకి కదలడంతో వర్షాల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.

సాధారణంగా ఈ సీజన్‌లో 7.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, శుక్రవారం నుంచి ఆదివారం మధ్య ఏకంగా 66.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో బందాలో 227.6 మి.మీ., ఫతేగఢ్‌లో 224 మి.మీ., బహ్రైచ్‌లోని నాన్‌పారాలో 217 మి.మీ., హర్దోయ్‌లో 214 మి.మీ., కాయం గంజ్, హమీర్‌పూర్‌లలో 210 మి.మీ., కన్నౌజ్‌లో 204 మి.మీ. చొప్పున రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన రాజధాని లక్నోలోనూ 21 గంటల వ్యవధిలో 125.8 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉన్న వాయుగుండం ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వైపు కదులుతుండటంతో తూర్పు, పశ్చిమ యూపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

ఈ అకాల వర్షాల వల్ల రహదారులు మునిగిపోవడంతో పాటు చేతికొచ్చిన పంటలు నీటమునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports