Last Updated:
విజయ్ దేవరకొండ అభిమానులకు పండుగ వాతావరణం ముందే వచ్చేసింది. రణబాలి రిలీజ్ కంటే ముందే ‘రణబాలి: నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్’ (Ranabali: Never Forget The Truth) పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రకటించారు మేకర్స్.
టాలీవుడ్ క్రేజీ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అభిమానులకు పండుగ వాతావరణం ముందే వచ్చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. ఇప్పుడు రణబాలి అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న మరోసారి కథానాయికగా నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం టాలీవుడ్లో మునుపెన్నడూ లేని సరికొత్త వ్యూహాన్ని రచించింది. సినిమాలోని చారిత్రక నేపథ్యాన్ని, మేకింగ్ విశేషాలను ప్రేక్షకులకు ముందుగానే తెలియజేసేందుకు ‘రణబాలి: నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్’ (Ranabali: Never Forget The Truth) పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రకటించింది.
చరిత్ర పుటల్లో మనకు తెలియకుండా కనుమరుగైన అనేక చేదు నిజాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా చూపించనున్నారు. యూట్యూబ్ వేదికగా ఈరోజు తొలి ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఈ నెల 30న రెండో ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’, అక్టోబరు 2న మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్ గాట్’ విడుదల కానున్నాయి. ఇక చివరిదైన నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ బిహైండ్ ది సీన్స్ కంటెంట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు, విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం ‘రౌడీ జనార్ధన్’ కోసం కూడా రంగంలోకి దిగారు. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ రూరల్ యాక్షన్ డ్రామాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కర్ణాటకలోని మంగళూరులో ప్రారంభమైంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ నబకాంత్ నేతృత్వంలో విజయ్ దేవరకొండపై ఒక భారీ యాక్షన్ ఘట్టాన్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారం వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ‘రౌడీ జనార్ధన’ను థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఒకేసారి రెండు భారీ చిత్రాలతో విజయ్ దేవరకొండ రాబోతుండటం పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.














