విజయ్ దేవరకొండతో యాడ్.. ఇప్పుడు హీరోయిన్‌గా ‘తత్వం’తో ఎంట్రీ.. హీరోయిన్ దష్విక ఆసక్తికర విషయాలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

విజయ్ దేవరకొండతో యాడ్.. ఇప్పుడు హీరోయిన్‌గా ‘తత్వం’తో ఎంట్రీ.. హీరోయిన్ దష్విక ఆసక్తికర విషయాలు! | తెలుగు సినిమా వార్తలు


ఈ సందర్భంగా హీరోయిన్ దష్విక మీడియాతో మాట్లాడుతూ తన తొలి సినిమా అనుభవాలను పంచుకున్నారు. వైజాగ్‌కు చెందిన దష్వికకు ‘తత్వం’ హీరోయిన్‌గా తొలి చిత్రం. సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు. ఆడిషన్స్ ద్వారా తనను ఎంపిక చేశారని చెప్పారు. గతంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించినట్లు వెల్లడించారు.

తొలి సినిమాతోనే నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని దష్విక చెప్పారు. ‘తత్వం’ కథను మొదటిసారి విన్నప్పుడే తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎమోషన్‌తో పాటు సస్పెన్స్ కూడా ఉంటుందని చెప్పారు.

సినిమాలో తన పాత్రకు గ్రే షేడ్స్ ఉంటాయని దష్విక వెల్లడించారు. అయితే ఆ పాత్ర ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఉంటుందని, ప్రస్తుతం ఎక్కువ విషయాలు బయటకు చెప్పలేనని అన్నారు. తన పాత్ర చాలా సాఫ్ట్‌గా ఉంటుందని, హీరోకు అండగా నిలుస్తూ కిల్లర్‌ను కనిపెట్టే ప్రయత్నంలో అతడికి సహాయం చేస్తుందని తెలిపారు.

‘తత్వం’ ఒక మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ అని దష్విక చెప్పారు. సినిమాలో ఎక్కడ ఎలాంటి ఉత్కంఠ ఉండాలో అక్కడ అలాంటి అంశాలు ఉంటాయని, సినిమా ఎక్కడా బోర్ కొట్టించదని అన్నారు. మలయాళంలో ఇలాంటి కథాంశాలతో సినిమాలు రావడం చూశానని, అదే తరహా కథతో తెలుగులో సినిమా రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా షైగా ఉంటానని, ఆ లక్షణం సినిమాలో తన పాత్రకు కూడా ఉపయోగపడిందని తెలిపారు.

చిన్నప్పటి నుంచే నటన అంటే తనకు ఇష్టమని దష్విక చెప్పారు. మూడో తరగతిలోనే తాను నటి అవుతానని టీచర్‌తో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. సినిమా, మోడలింగ్‌పై ఆసక్తితో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల కోరిక మేరకు చదువు పూర్తిచేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. యాక్టింగ్‌లో మహతి బిక్షు దగ్గర శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు కొన్ని విషయాలు విని భయపడ్డానని, అయితే ఏ రంగంలో ఉన్నా పరిస్థితులను మనకు అనుగుణంగా మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగాలని అర్థమైందని దష్విక చెప్పారు. తన విషయంలో ఇండస్ట్రీ జర్నీ చాలా స్మూత్‌గా సాగిందని, బయట అనుకున్నంత బ్యాడ్‌గా ఏమీ లేదని అన్నారు.

హీరో దినేష్ తేజ్ చాలా సపోర్టివ్‌గా ఉంటారని దష్విక చెప్పారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ల సమయంలో తనకు ఎంతో సహకరించారని తెలిపారు. దర్శకుడు అర్జున్ కోలా చాలా సైలెంట్‌గా ఉంటారని, ఆయనకు కథపై మంచి క్లారిటీ ఉందని ప్రశంసించారు. స్టార్టప్‌లో ఉద్యోగం చేస్తూనే మూడు నెలలు లీవ్ తీసుకుని ఈ సినిమా తెరకెక్కించారని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పారు.

కథ, కథనంతో పాటు చేతన భరద్వాజ్ అందించిన సంగీతం, ఆర్‌ఆర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దష్విక తెలిపారు. ‘తత్వం’ అనే టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందని, మొదట్లో ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని చిత్రబృందం ఆందోళన చెందిందని చెప్పారు. అయితే ఇప్పటికే మంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, అక్టోబర్ 2 తర్వాత సినిమా కూడా టైటిల్‌లాగే డిఫరెంట్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని, ముఖ్యంగా లవ్ స్టోరీస్‌లో నటించాలని కోరుకుంటున్నానని దష్విక చెప్పారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. నవంబర్‌లో ఓ తమిళ సినిమా ప్రారంభం కానుందని, తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed