Hyderabad: భార్య తలను రోకలి పండతో పచ్చడి చేశాడు.. ఆ ఒక్క కారణంతోనే యముడిగా మారిన మొగుడు | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad


Last Updated:

Hyderabad: క్షణికావేశం, కాపురంలో అనుమానం పచ్చని సంసారాల్లో ఎలాంటి చిచ్చు పెడతాయో నిరూపించే హృదయవిదారక ఘటన నగరంలో చోటుచేసుకుంది.

Hyderabad
Hyderabad

భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారి, కళ్లెదుటే ఉన్న పసిబిడ్డను కూడా చూడకుండా కట్టుకున్న భార్య తలపై రోకలిబండతో బలంగా బాది కిరాతకంగా హతమార్చాడో భర్త. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన నరేందర్‌కు, తేజశ్రీ (25)తో సుమారు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం రోహిత్ (4) అనే కుమారుడు ఉన్నాడు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఈ కుటుంబం, గత ఆరు నెలలుగా చిక్కడపల్లి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటోంది. నరేందర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కాపురంలో అనుమానం చిచ్చు

కొంతకాలంగా నరేందర్ తన భార్య తేజశ్రీ నడవడికపై తీవ్ర అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ తీవ్రస్థాయిలో వాగ్వాదాలు, గొడవలు జరుగుతుండేవి. సంసారంలో రేగిన ఈ అనుమానం రోజురోజుకూ ముదిరింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం మొదలైంది. మాటమాట పెరిగి పరిస్థితి చేయిదాటిపోవడంతో నరేందర్ తీవ్ర ఆగ్రహానికి, ఆవేశానికి లోనయ్యాడు.

కన్నబిడ్డ ఎదుటే ఘోరం

ఆగ్రహంతో ఊగిపోయిన నరేందర్ ఇంట్లో ఉన్న రోకలిబండను తీసుకుని, భార్య తేజశ్రీ తలపై అత్యంత బలంగా కొట్టాడు. ఊహించని ఈ దాడితో తీవ్ర రక్తస్రావమై తేజశ్రీ నేలపై కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఈ ఘోరమంతా వీరి నాలుగేళ్ల కుమారుడు రోహిత్ చూస్తుండగానే క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఆ చిన్నారి బిక్కుబిక్కుమంటూ రోదించాడు.

భార్య ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించుకున్న అనంతరం నరేందర్ నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. సమాచారం అందుకున్న వెంటనే చిక్కడపల్లి ఏసీపీ రణవీర్ రెడ్డి, సీఐ మధుబాబు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఘటనా స్థలంలో వేలిముద్రలు, రక్తపు నమూనాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, తల్లిని కోల్పోయి, తండ్రి జైలుపాలై ఆ పసివాడు అనాథగా మారడం స్థానికులను కంటతడి పెట్టించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed