Tirupati Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..! crane-accident-in-tirupati-three-dead. | | ACTPnews

News18


Last Updated:

తిరుపతిలో క్రేన్ ప్రమాదం: డీబీఆర్ రోడ్డులోని హోటల్ నిర్మాణ పనుల్లో క్రేన్ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

+

News18

తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డీబీఆర్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ క్రేన్‌ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగి లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో క్రేన్‌ కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా నిర్మాణ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్‌ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. క్రేన్‌ కింద పలువురు చిక్కుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతను పరిశీలించిన అనంతరం క్రేన్‌ను తొలగించి కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

క్రేన్‌ కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయితే అప్పటికే ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన రామారావు (45), శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్‌ ఇంజనీర్‌ సందీప్‌ (34), తిరుపతికి చెందిన గార్డెన్‌ వర్కర్‌ చెంగయ్య (40) మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. నిర్మాణ పనుల్లో భాగంగా వీరు అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలియడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మరోవైపు భారీ క్రేన్‌ను అక్కడి నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు వివరాలు సేకరించారు. క్రేన్‌ ఏ పరిస్థితుల్లో అదుపుతప్పింది? నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? క్రేన్‌ నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. ముగ్గురు కార్మికులు మృతి చెందడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో తిరుపతిలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports