Last Updated:
అరేబియా సముద్రంలో గుజరాత్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రూ.3,000 కోట్ల విలువైన 526 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇరాన్ పడవలో ప్రయాణిస్తున్న ఐదుగురు పాకిస్థానీ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
భారత తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ అరేబియా సముద్రంలో ఉమ్మడిగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు. లక్షద్వీప్ పశ్చిమ దిశలో భారత జలాల్లోకి చొరబడిన ‘ఆజాద్’ అనే అనుమానాస్పద ఇరాన్ పడవను అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారు. ఆ బోటును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన 526 కిలోల మత్తుపదార్థాలు బయటపడ్డాయి. ఇందులో 400 కిలోల మెథాంఫెటమైన్, 126 కిలోల స్వచ్ఛమైన హెరాయిన్ ఉన్నాయి.
ఈ నౌకలో ప్రయాణిస్తున్న ఐదుగురు పాకిస్థానీ సిబ్బందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. నిందితులను మహమద్ బలూచి, షాకిరుల్లా, వాహిదుల్లా, అహ్మద్ ఖాన్, ఫరీదుల్లాగా గుర్తించారు. సెప్టెంబర్ 10న అందిన పక్కా నిఘా సమాచారంతో చేపట్టిన ఈ ఉమ్మడి గాలింపు చర్యలతో దేశంలోకి జరగాల్సిన పెను చొరబాటు తప్పింది.
ప్రాథమిక విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పడవ తొలుత ఇరాన్‌లోని కొనారక్ నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ తర్వాత పాకిస్థాన్‌లోని గ్వాదర్ తీరానికి చేరుకుని, అక్కడే భారీగా హెరాయిన్, మెత్ సంచులను పడవలోకి ఎక్కించారు. అనంతరం సముద్ర మార్గం గుండా తమిళనాడు తీరానికి చేరవేసి, అక్కడి నుంచి వివిధ వాహనాల్లో పంజాబ్‌కు తరలించాలని స్మగ్లర్లు పక్కా పథకం రచించారు.
అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా డాన్ హాజీ సలీమ్ సిండికేట్ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ భారీ డ్రగ్స్ డీల్ కోసం హవాలా నెట్‌వర్క్ ద్వారా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. గతంలో కూడా ఇతని ముఠా గుజరాత్, కేరళ తీరాల మీదుగా భారత్‌లోకి మాదకద్రవ్యాలు పంపే ప్రయత్నం చేసి పట్టుబడింది.
నిందితులపై ఎన్‌డిపిఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసి, వారి వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని స్థానిక రిసీవర్లు ఎవరు, ఈ రాకెట్‌తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. తీరప్రాంత భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ భారత నేవీ, కోస్ట్ గార్డ్ నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.














