Last Updated:
టాలీవుడ్‌లో ఈ మధ్య చిన్న సినిమాలు కొత్త కథలు, విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకపోయినా.. కంటెంట్ బాగుంటే ఓటీటీ వేదికగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.
టాలీవుడ్‌లో ఈ మధ్య చిన్న సినిమాలు కొత్త కథలు, విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకపోయినా.. కంటెంట్ బాగుంటే ఓటీటీ వేదికగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఈ కోవలోకి వచ్చే మరో చిన్న సినిమా ‘అమీర్ లోగ్’. పూర్తిగా నూతన నటీనటులతో రూపొందిన ఈ కామెడీ డ్రామా సినిమా థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయినా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ‘అమీర్ లోగ్’ గత నెల 21న థియేటర్లలో విడుదలైంది. అయితే సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం జరగలేదు. అదే సమయంలో రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రభావం కూడా బాక్సాఫీస్‌పై ఉండటంతో ‘అమీర్ లోగ్’కు ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. చాలామంది ప్రేక్షకులకు ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇప్పుడు ఈ చిన్న సినిమాకు ఓటీటీ ద్వారా మంచి అవకాశం లభించింది. ‘అమీర్ లోగ్’ ఒకేసారి మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ‘ఆహా’, ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’, ‘సన్ నెక్స్ట్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకేసారి మూడు ఓటీటీల్లోకి సినిమా రావడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ బస్తీ నేపథ్యంలో కథ:
‘అమీర్ లోగ్’ కథ హైదరాబాద్‌లోని ఓ బస్తీ నేపథ్యంలో సాగుతుంది. జీవితంలో పెద్దగా లక్ష్యాలు లేకుండా జులాయిగా తిరిగే ముగ్గురు స్నేహితులు శ్రీను, ఫరూక్, మల్లేశ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఎలాంటి పని లేకుండా తిరుగుతూ, సరదాగా కాలం గడిపే ఈ ముగ్గురికి అదే బస్తీకి చెందిన నజీర్‌తో క్రికెట్ విషయంలో గొడవ జరుగుతుంది.
వీరి పరిస్థితిని గమనించిన బస్తీకి చెందిన గీత.. ముగ్గురినీ తమ్ముళ్లుగా భావిస్తుంది. జీవితంలో స్థిరపడాలని, ఏదైనా పని చేసుకుని మంచి దారిలో వెళ్లాలని వారికి సూచిస్తుంది. ఆమె సహకారంతో శ్రీను ఓ ఆఫీస్‌లో ఆఫీస్ బాయ్‌గా ఉద్యోగంలో చేరతాడు.
అక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆఫీస్‌లో సహోద్యోగులతో సరదాగా క్రికెట్ ఆడిన శ్రీను.. మాటల మధ్యలో పంతానికి వెళ్లి తమ బస్తీ టీమ్ చాలా బాగా ఆడుతుందని సవాల్ చేస్తాడు. చివరకు భారీ బెట్టింగ్‌కు దిగుతాడు. దీంతో బస్తీ టీమ్, ఆఫీస్ టీమ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కథలో కీలకంగా మారుతుంది.
మరి ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిచారు? శ్రీను చేసిన బెట్టింగ్ పరిస్థితులను ఎక్కడికి తీసుకెళ్లింది? ముగ్గురు స్నేహితుల జీవితాలను మార్చడంలో బస్తీ పెద్దాయన చాచా పాత్ర ఏమిటి? కథలోకి వచ్చిన ‘బిర్యానీ’ కాన్సెప్ట్ ఏంటి? గీత ప్రియుడు రవి ఎంట్రీతో ఈ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
హైదరాబాద్ నగర వాతావరణం, బస్తీ జీవనశైలి, సహజమైన సంభాషణలు, స్నేహితుల మధ్య జరిగే సరదా గొడవలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే కామెడీ, ఎమోషనల్ అంశాలను కలిపి దర్శకుడు కథను నడిపించినట్లు తెలుస్తోంది.
థియేటర్లలో పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయిన ‘అమీర్ లోగ్’కు ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం వచ్చింది. వీకెండ్‌లో పెద్దగా సీరియస్ కంటెంట్ కాకుండా.. హైదరాబాద్ బస్తీ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాను సరదాగా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఓ ఎంపికగా నిలవొచ్చు.














