Last Updated:
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలో భారత పైలట్ పోరాటానికి ప్రపంచం సెల్యూట్ కొట్టింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో….
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయనను “హీరో”గా అభివర్ణించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చూపిన ధైర్యం ఎంతో గొప్పదని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో స్మిత్ సాహసాన్ని కొనియాడారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్, కో-పైలట్ మధ్య జరిగిన ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పటికీ ఆయన విమాన నియంత్రణను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన చూపిన తెగువ కారణంగా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మోదీ ఆకాంక్షించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించిన వివరాల ప్రకారం.. విమానంలో జరిగిన దాడిలో కెప్టెన్ స్మిత్‌పై కత్తితో దాడి జరిగినప్పటికీ ఆయన ప్రతిఘటించారు. తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, ఇతర సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. అనంతరం విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని సురక్షితంగా సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు.
సుమారు 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం ఎఫ్‌జెడ్1073గా దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోంది. ఘటన సమయంలో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. విమానం మొదట 7700 స్క్వాక్ కోడ్‌ను పంపింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. ఆ తర్వాత 7500 కోడ్‌కు మారింది. విమానంలో చట్టవిరుద్ధ జోక్యం లేదా హైజాక్ వంటి పరిస్థితులను సూచించే ఈ సంకేతంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఇదే సమయంలో విమానం ఎత్తు కూడా ఒక్కసారిగా గణనీయంగా తగ్గినట్లు విమాన ట్రాకింగ్ సమాచారం వెల్లడించింది.
కెప్టెన్ స్మిత్‌ను నెతన్యాహు కూడా నిజమైన హీరోగా అభివర్ణించారు. ఆయన పోరాడి కాక్‌పిట్ తలుపు తెరవడం వల్ల ప్రయాణికులు, సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని అడ్డుకోగలిగారని చెప్పారు. మొత్తం 174 మంది ప్రాణాలను కాపాడినట్లు నెతన్యాహు పేర్కొంటూ స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టబుక్‌లో విమానం అత్యవసరంగా దిగిన అనంతరం స్మిత్‌ను ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఘటనపై స్పందిస్తూ కో-పైలట్‌ను అనుమానిత ఉగ్రవాది లేదా మానసికంగా అస్థిర వ్యక్తిగా పేర్కొన్న వ్యాఖ్యలు చేశారు. స్మిత్ పోరాటం వల్ల భారీ విపత్తు తప్పిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం, విమానంలోని ఓ ఇజ్రాయెల్ ప్రయాణికుడు కూడా జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. అనంతరం ఇతర పైలట్లు, భద్రతా సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకుని పరిస్థితిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు.














