Last Updated:
సిటీలో హైటెక్ వ్యభిచారం.. హోటల్‌పై పోలీసుల రైడ్.. అడ్డంగా బుక్కైన విదేశీ భామలు!
హైటెక్ సిటీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ భారీ చీకటి దందా బట్టబయలైంది. ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి ప్రాంతంలో విదేశీ అమ్మాయిలను రప్పించి అత్యంత రహస్యంగా సాగిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠా ఆటను పోలీసులు కట్టడి చేశారు. సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతూ, తెరవెనుక విదేశీ యువతులతో ఈ నీచమైన వ్యాపారం చేస్తున్న నిర్వాహకులను కటకటాల వెనక్కి నెట్టారు. గచ్చిబౌలి పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు చేసిన ఆకస్మిక దాడిలో ఈ రాకెట్ బాగోతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పరిధిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్ కేంద్రంగా ఈ వ్యభిచార దందా సాగుతోంది. ఆన్లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి విదేశీ యువతులతో ఈ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారాన్ని తీవ్రంగా పరిగణించిన గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులతో కలిసి పక్కా వ్యూహంతో హోటల్‌పై దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను పసిగట్టేలోపే నిర్వాహకులు, కస్టమర్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
ఈ దాడుల్లో ఈ చీకటి వ్యాపారాన్ని నడిపిస్తున్న ప్రధాన నిర్వాహకుడు నిఖిల్‌తో పాటు అతనికి సహకరిస్తున్న రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న హర్షిత్ సింఘానియా అనే విటుడిని కూడా అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన నిఖిల్ ఈ వ్యభిచార ముఠాను ఆపరేట్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డ్రీమ్ ప్రైడ్ హోటల్‌లో వేర్వేరు గదులను బుక్ చేసిన నిఖిల్, ఆ గదుల్లో విదేశీ యువతులను ఉంచి అత్యంత గుట్టుగా ఈ వ్యభిచార దందాను నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సంఘటనా స్థలంలో ముగ్గురు విదేశీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన వారని, కొద్ది రోజుల క్రితమే విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఈ యువతుల పాస్‌పోర్టులు, వీసాలు అన్నీ చెల్లుబాటులోనే ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దాడుల సమయంలో హోటల్ గదుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు 23 వాడిన కాండమ్స్, 13 వేల రూపాయల నగదును సీజ్ చేశారు. అలాగే రామ్మోహన్ రెడ్డి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా వెనుక ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో గచ్చిబౌలి పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన నిఖిల్ ఉజ్బెకిస్థాన్ అమ్మాయిలను ఎలా తీసుకువచ్చాడు, ఆన్లైన్ ద్వారా నెట్‌వర్క్ ఎలా విస్తరించాడు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పట్టుబడిన మొబైల్ ఫోన్ల కాల్ డేటా ఆధారంగా ఈ చీకటి వ్యాపారంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు వల పన్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.














