Last Updated:
ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble). నేడు (అక్టోబర్ 2, 2026) గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి విడుదలైంది.
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి, ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా చిత్రాలతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble). నేడు (అక్టోబర్ 2, 2026) గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘ఆర్కా మీడియా వర్క్స్’ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బేబీ సారా కీలక పాత్ర పోషించింది. మరి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..
ఫహాద్ ఫాజిల్ ‘సూరి’ అనే అనాథ యువకుడి పాత్రలో నటించాడు. వృత్తిరీత్యా అంబులెన్స్ డ్రైవర్ అయినప్పటికీ, ఈజీ మనీకి అలవాటు పడి ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆ ఏరియా డాన్ అస్లాం భాయ్ (మహేశ్ మంజ్రేకర్)ను మోసం చేసి ఒక పందెంలో డబ్బు సంపాదిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న డాన్.. రెండు నెలల్లో రూ. 25 లక్షలు వెనక్కి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. ఆ డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేయాలనే షార్ట్ కట్స్ వెతికే క్రమంలో సూరికి ‘బేబీ దివ్య’ (బేబీ సారా) అనే చిన్నారి పరిచయం అవుతుంది. ఆమెకు కొన్ని అతీంద్రియ శక్తులు (స్పెషల్ పవర్స్) ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఆమె కేవలం సూరికి మాత్రమే కనిపిస్తుంది. అసలు ఈ చిన్నారి నేపథ్యం ఏంటి? ఆమె సూరికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఆమె శక్తులను వాడుకుని సూరి డాన్‌కు డబ్బు కట్టాడా? ఈ క్రమంలో సూరి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ సినిమా కథాంశం.
రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాత కావడం, ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్ తీసిన ఆర్కా మీడియా బ్యానర్ నుంచి సినిమా రావడం, దానికి తోడు ఫహాద్ ఫాజిల్ లాంటి గ్రేట్ యాక్టర్ ఉండటంతో ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లారు. కానీ, ఆ స్థాయి అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా కొంత విఫలమైందనే చెప్పాలి. దర్శకుడు శశాంక్ ఏలేటి ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా, దానిని తెరపై ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో మలచడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ లో అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడంతో పాటు సూరి పాత్రను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఇంటర్వెల్ తర్వాత బేబీ దివ్య ఎంట్రీతో సినిమా ఫాంటసీ జోనర్‌లోకి మారుతుంది. సెకండాఫ్ లో కూడా కథ నెమ్మదిగా సాగినప్పటికీ, ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే సీన్స్ అయితే పడ్డాయి. లాజిక్ లేని సీన్స్ సినిమాకు పెద్ద మైనస్. హీరో, బేబీ మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ బాగానే చూపించారు. కథను ఇంకాస్త గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ వేరేలా ఉండేది. సినిమా ఎలా ఉన్నా కూడా చివరి 15 నిమిషాలు మాత్రం ప్రేక్షకులకు మంచి ఫీల్ తెప్పించింది.
ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న ఫహాద్ ఫాజిల్, ఈ సినిమాలో కూడా తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. బేబీ సారా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, అమాయకపు నటనతో మెప్పించింది. విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ తనకు ఇచ్చిన పాత్రను న్యాయం చేశాడు. సౌరభ్ సచ్‌దేవ్, సుబ్బరాజ్ పర్వాలేదనిపించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది, నిర్మాణ విలువలు ఆర్కా మీడియా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నతంగా ఉన్నాయి. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాలో ఉన్న చాలా సాగదీత సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే రిజల్ట్ మెరుగ్గా ఉండేది.
ఫైనల్ గా చెప్పాలంటే.. భారీ అంచనాలతో వచ్చిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఫర్వాలేదనిపించింది. ఫహాద్ ఫాజిల్ నటనను ఇష్టపడేవారు ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.
రేటింగ్: 2














