Tella Kagitham Movie Review: తెల్లకాగితం మూవీ రివ్యూ.. టీనేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Tella Kagitham Movie Review: తెల్లకాగితం మూవీ రివ్యూ.. టీనేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు


కథ:

రాము (హర్ష్ రోషన్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అన్న, వదిన సంరక్షణలో పెరుగుతాడు. పదో తరగతి చదువుతున్న సమయంలో తన సహ విద్యార్థిని ఆశ (నక్షత్ర)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఆశ కూడా రామును ప్రేమిస్తుంది.

అయితే ఇద్దరూ టీనేజ్ వయసులో ఉండటంతో.. ఆ వయసుకు సహజమైన అమాయకత్వంతో కొన్ని తప్పటడుగులు వేస్తారు. ఆ నిర్ణయాలు వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతాయి. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా సమస్యను తామే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రాము, ఆశ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? వారి నిర్ణయాల ప్రభావం కుటుంబంపై ఎలా పడింది? చివరకు వారి ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

కథా విశ్లేషణ:

టీనేజ్ వయసులో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే పాయింట్‌తో ‘తెల్లకాగితం’ తెరకెక్కింది. ఆ వయసులో మనసు ఒక తెల్లకాగితంలా ఉంటుందని.. దానిపై రాసుకునే అనుభవాలు, నిర్ణయాలు జీవితాన్ని ఎలా మార్చగలవో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. హీరో, హీరోయిన్ మధ్య పరిచయం ప్రేమగా మారే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. వారి మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తుంది. యూత్‌ను ఆకట్టుకునేలా పాటలను కూడా రూపొందించారు. ముఖ్యంగా రెండు పాటలు సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి.

కథలో అసలు సమస్య మొదలైన తర్వాత సినిమా సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. టీనేజ్‌లో సరైన అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే విషయాన్ని చూపించారు. చిన్న వయసులో పిల్లలకు సరైన అవగాహన కల్పించడం, తల్లిదండ్రులు వారితో స్నేహపూర్వకంగా ఉండటం ఎంత ముఖ్యమో కూడా కథలో చూపించారు. కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలతో కమ్యూనికేషన్ వంటి అంశాలను కథలో భాగం చేయడం బాగుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. అక్కడ కాస్త వేగం పెంచి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా అనిపించేది. అయినప్పటికీ క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు ఆలోచించేలా ముగింపును రూపొందించారు.

నటీనటుల పర్పార్మెన్స్:

హర్ష్ రోషన్ రాము పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. టీనేజ్ కుర్రాడి అమాయకత్వం, ప్రేమ, అయోమయం వంటి భావాలను తన హావభావాలతో చక్కగా చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. నక్షత్రకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. కొత్త నటిగా కనిపించకుండా ఆశ పాత్రలో సహజంగా నటించింది. అమాయకత్వంతో కూడిన పాత్రను చక్కగా పోషించింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

అజయ్ మెడికల్ స్టోర్ మూర్తి పాత్రలో మెప్పించాడు. హీరో స్నేహితుడి పాత్రలో నటించిన కుర్రాడు కూడా తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. శరణ్య ప్రదీప్ వదిన పాత్రలో సహజంగా నటించింది. రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా ‘తెల్లకాగితం’ మంచి స్థాయిలో ఉంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటల్లో రెండు పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా సాగుతుంది. కె.వి. గుహన్ కెమెరా పనితనం బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని, పాత్రల భావోద్వేగాలను అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

రచయిత నందు సవిరిగాన ఎంచుకున్న కథాంశం ప్రస్తుత సమాజానికి సంబంధించిన అంశాలను టచ్ చేస్తుంది. టీనేజ్‌లో తెలియక చేసే తప్పులు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఈ పాయింట్‌ను ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో మేళవించి తెరకెక్కించాడు.

చివరగా:

‘తెల్లకాగితం’ను కేవలం ఒక టీనేజ్ ప్రేమకథగా చూడలేం. ఆ వయసులో తెలియక తీసుకునే నిర్ణయాలు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. హర్ష్ రోషన్, నక్షత్రల సహజమైన నటన, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్, కుటుంబ భావోద్వేగాలు, చివర్లో వచ్చే సందేశం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా.. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం సినిమాకు బలంగా నిలుస్తుంది. టీనేజ్ లవ్ స్టోరీస్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, మంచి సందేశం ఉన్న సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘తెల్లకాగితం’ ఒకసారి చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది.

రేటింగ్: 3/5



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports