Last Updated:
ఆసియా క్రీడలు 2026 రెజ్లింగ్‌లో భారత్‌కు మొదటి బంగారు పతకం లభించింది. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్లో 23 ఏళ్ల సుజీత్ కల్కల్ అద్భుత పునరాగమనంతో తాజికిస్థాన్ రెజ్లర్‌ను ఓడించి స్వర్ణం ముద్దాడాడు.
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asia Games 2026) భారత యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో తాజికిస్థాన్‌కు చెందిన అబ్దుల్ మజీద్ కుదియేవ్‌ను 10-9 తేడాతో మట్టికరిపించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో 2-9 పాయింట్లతో చాలా వెనుకబడిన 23 ఏళ్ల సుజీత్, చివరి సెకన్లలో అనూహ్యంగా పుంజుకుని వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. ఓటమి అంచుల్లో నిలిచి కనబరిచిన ఈ సూపర్ కమ్‌బ్యాక్ స్టేడియంలోని ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
స్వర్ణ పతక పోరుకు చేరే క్రమంలో సుజీత్ బలమైన ప్రత్యర్థులను చిత్తు చేశాడు. తొలి బౌట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సయ్యద్ ఒమర్ జజాయ్‌పై 13-3 తేడాతో సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శించి క్వార్టర్ ఫైనల్ చేరాడు. అనంతరం ఇరాన్ రెజ్లర్ అబ్బాస్ ఇబ్రహీంపై ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించాడు.

సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ కొటారో కియోకాను ఎదుర్కొని అద్భుత ప్రతిభ కనబరిచాడు. మొదటి రౌండ్‌లో వెనుకబడినప్పటికీ రెండో రౌండ్‌లో స్కోరును 3-3తో సమం చేశాడు. చివరకు అత్యుత్తమ టెక్నికల్ మూవ్ నిబంధన ప్రకారం విజేతగా నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.
ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న సుజీత్, ఆసియా క్రీడల వేదికపై భారత రెజ్లింగ్ సత్తాను చాటిచెప్పాడు. అత్యంత కఠినమైన 65 కేజీల కేటగిరీలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ దేశానికి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.














