Last Updated:
ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల్లో ఒక మహిళ వింత డిమాండ్‌తో రోడ్డుపై బైఠాయించి హల్‌చల్ చేసింది. తమిళ నటుడు విజయ్‌ను కౌగిలించుకోవడమే తన కోరికంటూ పడుకోగా, పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత, అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఆ సమయంలో ఒక మహిళ నడిరోడ్డుపై పడుకుని వేసిన వింత డిమాండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ నుంచి లేవాలని పోలీసులు బతిమాలినప్పటికీ ఆమె ససేమిరా అంది. తమిళ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌ను కౌగిలించుకోవడమే తన చివరి కోరికని, ఆయన వచ్చే వరకు కదిలేది లేదని మొండికేసింది.
మహిళా కానిస్టేబుళ్లు ఆమెను పైకి లేపే ప్రయత్నం చేయగా, ‘నన్ను తాకవద్దు’ అంటూ గట్టిగా కేకలు వేసింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా పక్కకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR), పెద్ద సంఖ్యలో పేర్లను తొలగించడంపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ ప్రదర్శనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలతో పాటు ఐసా (AISA), ఎస్‌ఎఫ్ఐ (SFI), ఎన్‌ఎస్‌యూఐ (NSUI) విద్యార్థి సంఘాల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
A woman lay down on the street at Jantar Mantar, making an unusual demand … she says her last wish is to hug CM Vijay Thalapathy. 😭 pic.twitter.com/zfZGiwGbaL
— Sachin Unfiltered (@TheSachinView) September 30, 2026
ఈ ఆందోళన కార్యక్రమానికి ఎలాంటి అధికారిక అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జంతర్ మంతర్ పరిసరాల్లో ఆంక్షలు విధించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆప్ నేతలు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా, సంజయ్ సింగ్ సహా 700 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. భారీ బందోబస్తు మధ్య నిరసనకారులను ప్రత్యేక వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు.














