Premane Oorilo Movie: ‘ప్రేమనే ఊరిలో’ మూవీ రివ్యూ.. తండ్రీకొడుకుల బంధం ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Premane Oorilo Movie: ‘ప్రేమనే ఊరిలో’ మూవీ రివ్యూ.. తండ్రీకొడుకుల బంధం ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు


కథేంటి?

భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కుమారుడు సంతోష్ (శ్రీరామ్)ను ఎంతో ప్రేమగా పెంచుతాడు. వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరిలో జీవించే సంతోష్‌పై అతడి మరదలు వసంత (రమిక శివు) మనసు పారేసుకుంటుంది. అయితే సంతోష్ తండ్రి మాత్రం తన కొడుక్కి బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేయాలని కోరుకుంటాడు. మరోవైపు సంతోష్‌కు కూడా తన జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అభిప్రాయాలు, షరతులు ఉండటంతో సంబంధాలు కుదరవు.

ఇదే సమయంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ) పరిచయం సంతోష్ జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆమెను చూసిన వెంటనే సంతోష్ ప్రేమలో పడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పటికే ప్రేమలో ఉన్న సంతోష్ జీవితంలోకి పెళ్లి రావడంతో అసలు సంఘర్షణ మొదలవుతుంది. తండ్రి కోసం సంతోష్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? వసంత ప్రేమ ఏమైంది? రుక్మిణితో సంతోష్ బంధం ఎటు వెళ్లింది? అనేది తెరపై చూడాలి.

కథనం ఎలా ఉంది?

పచ్చని పొలాలు, గ్రామీణ జీవనం, కుటుంబ సంబంధాలు, పెళ్లి చూపులు.. ఇలా సినిమా మొదటి నుంచి చివరి వరకు పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. తొలి భాగంలో సంతోష్ పెళ్లి ప్రయత్నాలు, వసంత వన్‌సైడ్ లవ్, రుక్మిణి ఎంట్రీతో కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. కొన్ని సన్నివేశాలు క్యూట్‌గా, మరికొన్ని సరదాగా అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్‌కు వచ్చే పెళ్లి ట్విస్ట్ ముందే ఊహించగలిగినదే.

ద్వితీయార్థంలో కథ పూర్తిగా ఎమోషనల్ జోన్‌లోకి వెళ్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, ప్రేమ కోసం చేసే త్యాగాలు, కుటుంబం కోసం వ్యక్తిగత నిర్ణయాలను పక్కన పెట్టే పరిస్థితులను దర్శకుడు సున్నితంగా చూపించాడు. నాగన్న గతాన్ని చూపించే ఫ్లాష్‌బ్యాక్ పాత తరహాలో ఉన్నప్పటికీ భావోద్వేగం మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని క్యూట్ సన్నివేశాలను మరింత కుదించి ఉంటే కథనం వేగంగా సాగేది. సినిమాకు అసలు బలం చివరి అరగంట. తండ్రి–కొడుకు అనుబంధం, ప్రేమలో త్యాగం, కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలు క్లైమాక్స్‌లో బలమైన భావోద్వేగాన్ని పంచుతాయి. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. రైతులు, ఆడపిల్లల జీవితాలకు సంబంధించిన అంశాలను కూడా కథలో అంతర్లీనంగా చూపించారు.

నటీనటుల పనితీరు:

సంతోష్ పాత్రలో శ్రీరామ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. పల్లెటూరి యువకుడిగా, ప్రేమికుడిగా, భర్తగా పాత్రలోని వేరియేషన్స్‌ను చక్కగా చూపించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అతడి నటన మెప్పిస్తుంది. వసంతగా రమిక శివు మొదట్లో సరదాగా కనిపించి, తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంది. రుక్మిణిగా తపస్విని పూనాచ క్యూట్‌గా కనిపించింది. అయితే నాగన్న పాత్రలో రంగాయన రఘు నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. కొడుకుపై ప్రేమ, తండ్రిగా అతడి ఆందోళన, కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలను తన అనుభవంతో అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చింది.

టెక్నికల్‌గా:

సునద్ గౌతమ్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. రాజ్ కాంత్ SK సినిమాటోగ్రఫీతో పల్లెటూరి అందాలు, పచ్చని పొలాలు, ఆలయ పరిసరాలు అందంగా కనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే తెలుగు డబ్బింగ్‌లో కొన్ని చోట్ల డైలాగ్స్, లిప్ సింక్‌లో తేడా కనిపిస్తుంది. ఎడిటింగ్‌లో మరికొంత ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత షార్ప్‌గా ఉండేది.

చివరిగా: రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా పల్లెటూరి ప్రేమ, పెళ్లి, కుటుంబ బంధాలు, త్యాగం, భావోద్వేగాలతో తెరకెక్కిన క్లీన్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమనే ఊరిలో’. అక్కడక్కడా కనిపించే సాగదీతను భరిస్తే కుటుంబంతో కలిసి చూడొచ్చు.

రేటింగ్: 3/5



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *