CM Vijay: మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే అధినేత స్టాలిన్‌పై సీఎం విజయ్! | | ACTPnews

News18


Last Updated:

ధారాపురం ఉపఎన్నిక ప్రచారంలో టీవీకే మహిళా అభ్యర్థి సత్యభామపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్టాలిన్ వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు.

News18
News18

తమిళనాడు ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం రాజకీయ రగడకు దారితీసింది. టీవీకే పార్టీ అభ్యర్థి పి.సత్యభామను ఉద్దేశించి డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సభ ముసుగులో స్టాలిన్ అత్యంత అసభ్యకరమైన రీతిలో మాట్లాడారని, ఒక మహిళా నేత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యంగ్యాస్త్రాలు సంధించి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. డీఎంకే ఒక చెడు శక్తుల కూటమి అని అభివర్ణించిన విజయ్, మహిళలను కించపరిచేలా ప్రవర్తించడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. తోబుట్టువులైన మహిళలను అవమానించే ఇలాంటి వారికి ధారాపురం ఓటర్లతో పాటు తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతారని ఎక్స్ వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

బాడీ షేమింగ్ ఆరోపణలు.. ఈసీకి ఫిర్యాదు

ధారాపురం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్ అధికార టీవీకే పార్టీపై ఫిరాయింపుల ఆరోపణలు గుప్పించారు. గతంలో అన్నాడీఎంకేలో ఉన్న సత్యభామ టీవీకేలోకి మారడాన్ని ప్రస్తావిస్తూ ఆమెను “సూట్‌‌కేస్ భామ”, “పల్టీల భామ” అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా ఆమె శరీర ఆకృతిని కించపరిచేలా (బాడీ షేమింగ్) ఉన్నాయని టీవీకే శ్రేణులు భగ్గుమన్నాయి.

మహిళా నాయకురాలిని చులకనగా చూస్తూ మాట్లాడినందుకు స్టాలిన్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన డీఎంకే అధినేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

ప్రక్కనే మహిళా కార్యకర్తలను కూర్చోబెట్టుకుని మరో మహిళను కించపరిచే సంస్కృతి డీఎంకే నాయకుల్లో పేరుకుపోయిందని సీఎం విజయ్ దుయ్యబట్టారు. ఈ వివాదం ఇప్పుడు తమిళనాట రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *