Last Updated:
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్ కో-పైలట్ హమామ్ అల్ హమ్మామి నేర చరిత్రపై దర్యాప్తు వేగవంతమైంది. అతడి గత కార్యకలాపాలు, సిరియా సంబంధాలపై అంతర్జాతీయ దర్యాప్తు బృందాలు లోతుగా ఆరా తీస్తున్నాయి.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్-1073 విమానంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై గొడ్డలితో దాడి చేసిన 29 ఏళ్ల ఒమన్ కో-పైలట్ హమామ్ అల్ హమ్మామి గతంపై విచారణ ముమ్మరమైంది. సెప్టెంబర్ 30న కాక్‌పిట్‌లో జరిగిన ఈ భయానక ఘటన వెనుక తీవ్రవాద కుట్ర కోణం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఒమన్ దేశానికి చెందిన హమామ్, గతంలో పలు విమానయాన సంస్థల్లో పనిచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఫ్లైదుబాయ్ సంస్థలో చేరాడు. అయితే అతడికి తీవ్రవాద భావజాలం ఉన్నట్లు గతంలోనే ఒమన్ ఎయిర్ గుర్తించి విమానాలు నడిపే విధుల నుంచి తప్పించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాంటి ప్రమాదకర నేపథ్యం ఉన్న వ్యక్తిని దుబాయ్ విమానయాన సంస్థ ఎలా కాక్‌పిట్‌లోకి అనుమతించిందనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. హమామ్ అల్ హమ్మామి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే జన్మించాడు. ఇతడి తండ్రి ఒమన్ దేశస్థుడు కాగా, తల్లి సిరియాకు చెందిన మహిళ. హమామ్ ఒమన్ అధికారిక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టకముందు అతడు సిరియాలో కొన్నేళ్ల పాటు గడిపినట్లు రికార్డులు చెబుతున్నాయి. సరిగ్గా ఆ కాలంలోనే తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడై ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతడు ఏయే తేదీల్లో సిరియాకు వెళ్లాడు, అక్కడ ఎవరితో సంబంధాలు కొనసాగించాడనే పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
హమామ్ కెరీర్ ప్రారంభం ఒమన్‌లోనే జరిగింది. అతడు దాదాపు ఏడేళ్ల పాటు ఒమన్ ఎయిర్ సంస్థలో పనిచేసి 2025 ఫిబ్రవరిలో అక్కడి నుంచి వైదొలిగాడు. బ్రిటన్‌లోని బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో పట్టా కూడా పొందాడు. అయితే ఒమన్ ఎయిర్‌లో పనిచేస్తున్న సమయంలోనే అతడి అనుమానాస్పద నడవడిక అధికారుల దృష్టికి వచ్చింది. అతడి వద్ద తీవ్రవాదానికి సంబంధించిన అనుమానిత సమాచారం లభ్యమవడంతో 2024లోనే విమానాలు నడపకుండా ట్రైనింగ్ నుంచి తప్పించినట్లు భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒమన్ ఎయిర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హమామ్ 2025 మధ్యలో రాయల్ ఎయిర్ మొరాక్ విమానయాన సంస్థలో చేరాడు. అక్కడ 2026 జనవరి వరకు పనిచేసి, ఆ వెంటనే దుబాయ్ కేంద్రంగా నడిచే ఫ్లైదుబాయ్‌లోకి మారాడు. ఈ సంస్థలో చేరి దాదాపు ఎనిమిది నెలలు తిరగకముందే సెప్టెంబర్ 30న ఈ దారుణానికి ఒడిగట్టాడు. గతంలో భద్రతా సమస్యల వల్ల ఒక ఎయిర్‌లైన్ అతడిని పక్కనపెట్టినా, కొత్త సంస్థల్లో నియామక ప్రక్రియ ఎలా జరిగిందనే అంశంపై విమానయాన రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్-1073 విమానంలో ఫస్ట్ ఆఫీసర్‌గా ప్రయాణిస్తున్న హమామ్, గాల్లో ఉన్న సమయంలో విమాన అత్యవసర గొడ్డలితో భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని క్రాష్ చేయడమే లక్ష్యంగా వ్యవహరించాడు. తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా స్మిత్ మచ్చార్ డోర్ తీయడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చి హమామ్‌ను అడ్డుకుని బంధించారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
హమామ్ గతంలో సిరియాలో గడిపిన రోజులే ఈ కేసులో అత్యంత కీలకమైన మిస్టరీగా మారాయి. అక్కడే అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలు అతడిని మతోన్మాదిగా మార్చి ఉంటాయని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం యూఏఈ అదుపులో ఉన్న నిందితుడి ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ చాటింగులు, డిజిటల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతడు ఒంటరిగానే దాడికి తెగబడ్డాడా లేక వెనుక ఎవరైనా పెద్ద కుట్రదారులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.














