Last Updated:
Murder: తమ వివాహేతర సంబంధాల విషయాన్ని బయటపెట్టిందన్న అక్కసుతో తోడబుట్టిన సోదరుడి భార్య అని కూడా చూడకుండా, కడుపులో ఎదుగుతున్న పసికందుతో సహా ఆరు నెలల గర్భిణిని అతి దారుణంగా హత్య చేసిన అమానుష ఘటన తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో వెలుగుచూసింది.
హత్య చేసిన అనంతరం సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితులు వేసిన నాటకాన్ని పోలీసులు ఛేదించి, మృతురాలి ఆడపడుచులు, అత్త సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా మేలుపట్టి ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన పాండిదురై రహదారి పనుల కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి సంధ్య (21) అనే యువతితో కొద్ది నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం సంధ్య ఆరు నెలల గర్భవతి. కాగా, పాండిదురై సోదరీమణులైన మీనా, పౌర్నాడి తమ భర్తలతో విభేదాల కారణంగా విడిపోయి పుట్టింటికి వచ్చి పాండిదురై ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మీనా, పౌర్నాడి ఇద్దరికీ వేర్వేరు యువకులతో వివాహేతర సంబంధాలు ఏర్పడ్డాయి.
తమ ఇంట్లోనే జరుగుతున్న ఈ వివాహేతర సంబంధాల వ్యవహారాన్ని గమనించిన సంధ్య, తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. వారి ప్రవర్తన వల్ల కుటుంబ పరువు పోతోందని భావించి, విషయాన్ని భర్త పాండిదురై దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పాండిదురై తన సోదరీమణులను తీవ్రంగా మందలించాడు. అప్పటినుంచి తమ వ్యక్తిగత స్వేచ్ఛకు, అక్రమ సంబంధాలకు సంధ్య అడ్డుగోడగా మారిందని భావించిన ఆడపడుచులు ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా సంధ్యను అంతమొందించాలని పథకం రచించారు. ఈ క్రమంలో పాండిదురై పని నిమిత్తం ఈరోడ్‌కు వెళ్లడంతో ఇంట్లో సంధ్య ఒక్కతే మిగిలింది. అదే అదనుగా భావించిన ఆడపడుచులు మీనా, పౌర్నాడి తమ తల్లితో పాటు ఇతర బంధువులతో కలిసి గత నెల 30న తెల్లవారుజామున నిద్రిస్తున్న సంధ్యపై దాడి చేశారు. సంధ్య మెడకు చున్నీ గట్టిగా బిగించి, దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు.
అనంతరం ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సంధ్య నోట్లో, ముక్కులో పాలు పోసి, బ్రెడ్ ముక్కలు ఇరికించారు. ఉదయం పూట బ్రెడ్ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి ఎక్కిళ్లు వచ్చాయని, దాంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని స్థానికులను, బంధువులను నమ్మించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయిందని కథ అల్లారు. అయితే సంధ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. పోస్ట్‌మార్టం నివేదికలో సంధ్య ఊపిరాడక, గొంతు నులమడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని తేలింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. హత్య చేసినట్లు నిందితులు నేరం అంగీకరించడంతో మీనా, పౌర్నాడితో పాటు సహకరించిన ఇతర నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గర్భంతో ఉన్న మహిళను ఇంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.














