Singeetham Srinivasa Rao: ‘సింగీతం గారు ఎప్పటికీ మా హృదయాల్లోనే’.. దిగ్గజ దర్శకుడికి సినీ ప్రముఖుల నివాళులు..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Singeetham Srinivasa Rao: ‘సింగీతం గారు ఎప్పటికీ మా హృదయాల్లోనే’.. దిగ్గజ దర్శకుడికి సినీ ప్రముఖుల నివాళులు..! | తెలుగు సినిమా వార్తలు


చిరంజీవి:

సింగీతం శ్రీనివాసరావు మృతిపై చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఆయనను ఒక నిజమైన దార్శనికుడిగా అభివర్ణించారు. సింగీతం ఊహాశక్తి, కొత్త ఆలోచనలను ప్రయత్నించే ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించాయని అన్నారు. ఆయన ఇటీవల రూపొందించిన ‘సింగ్ గీతం’ సినిమా కథ చెప్పాలనే ఆయనలోని అంతులేని తపనకు నిదర్శనమని పేర్కొన్నారు. సింగీతం గారి మనసు ఎప్పుడూ యువకుడిగానే ఉండేదని, కొత్త విషయాలపై ఆసక్తి, సృజనాత్మకతతో ముందుకు సాగేవారని చిరంజీవి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

నాగార్జున:

సింగీతం శ్రీనివాసరావును ఎప్పటికీ తమ హృదయాల్లో నిలుపుకుంటామని అక్కినేని నాగార్జున పేర్కొన్నాడు. “ఫరెవర్ ఇన్ అవర్ హార్ట్స్, డియర్ సింగీతం శ్రీనివాసరావు గారు” అంటూ నివాళులు అర్పించాడు.

నందమూరి బాలకృష్ణ:

సింగీతం శ్రీనివాసరావు మరణం భారతీయ సినిమాకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నాడు. సింగీతం తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులని గుర్తు చేసుకున్నారు. తామిద్దరి కలయికలో ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ వంటి మూడు విభిన్నమైన క్లాసిక్ చిత్రాలు వచ్చాయని తెలిపారు. ‘ఆదిత్య 369’ తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు కొత్త ముద్ర వేసిందని, ‘భైరవ ద్వీపం’ తెలుగులో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారంగా వచ్చిన తొలి చిత్రాల్లో ఒకటిగా చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. 94 ఏళ్ల వయసులో చివరి శ్వాస వరకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారని బాలకృష్ణ అన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని, భారతీయ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టమని పేర్కొన్నారు.

వెంకటేష్:

సింగీతం శ్రీనివాసరావు మరణ వార్త విని తీవ్రంగా కలత చెందినట్లు వెంకటేష్ తెలిపాడు. ఆసక్తి, ఒరిజినాలిటీ, కొత్తదనంతో సినిమాను చూసిన దర్శకుల్లో సింగీతం ఒకరని అన్నారు. సినిమాపై ఉన్న జిజ్ఞాసను, ప్రయోగాత్మక దృక్పథాన్ని ఆయన ఎప్పుడూ వదులుకోలేదని తెలిపాడు. సినిమా మాయాజాలం, అవకాశాలపై చివరి వరకు నమ్మకం ఉంచిన అరుదైన దర్శకుడని కొనియాడాడు. సింగీతం మరణంతో తెలుగు సినిమాకు ఒక అసాధారణ అధ్యాయం ముగిసిందని అన్నాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు.

రవితేజ:

సింగీతం శ్రీనివాసరావు వయసు 94 ఏళ్లు అయినప్పటికీ, సినిమాపై ఆయన మనసు ఎప్పటికీ కొత్తగానే ఉందని రవితేజ అన్నాడు. “సింగీతం గారు.. సినిమాపై మీకున్న ప్యాషన్‌నే మీ గొప్ప వారసత్వం” అంటూ నివాళులు అర్పించాడు.

పవన్ కల్యాణ్:

సింగీతం శ్రీనివాసరావు మృతికి తీవ్ర విచారం వ్యక్తం పవన్ కల్యాణ్ చేశాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన విభిన్నమైన చిత్రాలను అందించారని గుర్తు చేసుకున్నాడు. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామరాజు’ వంటి సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయని అన్నారు. ‘అమెరికా అమ్మాయి’, ‘పంతులమ్మ’ వంటి సినిమాల్లోని పాటలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ సినిమాకు దర్శకత్వం వహించడం ఆయనకు సినిమాపై ఉన్న అచంచలమైన ఆసక్తికి నిదర్శనమని అన్నారు. సింగీతం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్:

సింగీతం శ్రీనివాసరావు మృతి వార్త ఎంతో బాధాకరంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘మయూరి’ వంటి సినిమాలతో కాలానికి ముందే ఆలోచించిన దర్శకుడిగా ఆయనను కొనియాడాడు. తరాలు మారినా ఆయన సినిమాలు కొత్తగానే అనిపిస్తాయని అన్నాడు. సింగీతం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు.

మహేశ్ బాబు:

సింగీతం శ్రీనివాసరావును భారతీయ సినిమాకు చెందిన దిగ్గజంగా మహేశ్ బాబు అభివర్ణించాడు. అసాధారణమైన ఊహాశక్తి, ధైర్యం, ప్రతిభ కలిగిన దర్శకుడని కొనియాడాడు. భారతీయ సినిమా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు.

నాని:

సింగీతం శ్రీనివాసరావును అసాధారణమైన జీవితాన్ని గడిపిన ఓ చిన్నారి లాంటి వ్యక్తిగా నాని అభివర్ణించాడు. ఆయన ప్రతిసారి ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా నేరుగా తనకు ఉన్న కొత్త ఆలోచన, తీయాలనుకున్న సినిమా గురించే మాట్లాడేవారని నాని గుర్తుచేసుకున్నారు. వయసు పెరిగినా ఆయనలోని ఉత్సాహం, ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదని అన్నారు. సింగీతం గారి కాలంలో ఉండటం, ఆయనతో కొన్ని జ్ఞాపకాలను పంచుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. “సర్.. మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు” అంటూ నాని భావోద్వేగ నివాళులు అర్పించాడు.

కల్యాణ్ రామ్:

సింగీతం శ్రీనివాసరావు భారతీయ సినిమాకు ఊహాశక్తి ఎంతటి అద్భుతాలను సృష్టించగలదో చూపించారని కల్యాణ్ రామ్ అన్నాడు.‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవ ద్వీపం’ వంటి చిత్రాలను గుర్తుచేస్తూ.. సింగీతం రూపొందించిన సినిమా వ్యాకరణం తరతరాలకు తాజాగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆయన కుటుంబ సభ్యులకు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నివాళులు అర్పించాడు.

వరుణ్ తేజ్:

సింగీతం శ్రీనివాసరావు గారు ఎన్నో ట్రెండ్స్ సృష్టించినప్పటికీ, ఎప్పుడూ ఏ ట్రెండ్‌ను అనుసరించలేదని వరుణ్ తేజ్ అన్నాడు. ఆయన సినిమాలు ధైర్యంగా, ఒరిజినల్‌గా, కాలంతో సంబంధం లేకుండా నిలిచిపోయాయని పేర్కొన్నాడు. సింగీతంతో కలిసి తెరపై కనిపించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఆయనతో పంచుకున్న క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. భారతీయ సినిమాకు సింగీతం చేసిన అపారమైన సేవలకు కృతజ్ఞతలు చెబుతూ నివాళులు అర్పించాడు.

విజయ్ దేవరకొండ:

సింగీతం శ్రీనివాసరావును ప్రేమతో విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నాడు. “సింగీతం సర్.. మీ నమ్మకాలు, మీ ఆలోచనలు, మీ కథలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి” అని పేర్కొన్నాడు. ‘పెళ్లిచూపులు’ సినిమా నుంచి తనకు ఫోన్ చేసి, మెసేజ్‌లు పంపుతూ ఎంతో ఆప్యాయత చూపించేవారని గుర్తు చేసుకున్నాడు. ‘సింగ్ గీతం’ సినిమాలో ఆయన విజన్‌లో భాగమవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సింగీతం నుంచి తనకు లభించిన ప్రేమ, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, ఆయనకు తన శాశ్వత గౌరవం ఉంటుందని విజయ్ దేవరకొండ తెలిపాడు.

కిరణ్ అబ్బవరం:

సింగీతం శ్రీనివాసరావును మిస్ అవుతున్నామని కిరణ్ అబ్బవరం తెలిపాడు. “మిమ్మల్ని మిస్ అవుతున్నాం సర్. రెస్ట్ ఇన్ పీస్ సింగీతం శ్రీనివాసరావు గారు” అంటూ నివాళులు అర్పించాడు.

మంచు విష్ణు:

సింగీతం శ్రీనివాసరావు మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధ కలిగించిందని మంచు విష్ణు తెలిపాడు. చిన్నప్పటి నుంచే సింగీతం సినిమాలు చూస్తూ ఆయన దర్శకత్వ ప్రతిభకు అభిమానిగా మారానని చెప్పాడు. సింగీతం నిజమైన సినిమా ప్రేమికుడని, తన ఊహలకు ఎప్పుడూ హద్దులు పెట్టుకోలేదని అన్నాడు. కొత్త ఆలోచనలను ధైర్యంగా ప్రయత్నిస్తూ, ఏ ఒక్క జానర్‌కో, ఫార్ములాకో పరిమితం కాకుండా సినిమాలు తీశారని కొనియాడాడు. ఆయన తీసిన ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చని, ప్రతి సినిమా ఒక పాఠ్యపుస్తకం లాంటిదని మంచు విష్ణు పేర్కొన్నాడు. తనను సినిమాల మాయాజాలంతో ప్రేమలో పడేసిన దర్శకుల్లో సింగీతం ఎప్పటికీ ఒకరుగా నిలిచిపోతారని అన్నాడు.

సింగీతం శ్రీనివాసరావు.. ఎప్పటికీ చిరస్మరణీయం:

సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు తనదైన ముద్ర వేసిన దర్శకుడు. ప్రయోగాలు, విభిన్న కథలు, కొత్త సాంకేతికతను పరిచయం చేయడం, ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం ఆయన ప్రత్యేకత. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు తరాలు మారినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. 94 ఏళ్ల వయసులోనూ సినిమాపై అదే ఆసక్తితో పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు.. తన సినిమాలతో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు.

ఓం శాంతి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed