Last Updated:
ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన భారత క్రీడాకారులకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహిళా క్రీడాకారుల అద్భుత ప్రదర్శన దేశానికే గర్వకారణమని కొనియాడారు.
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా ముగిసిన 2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శనతో అదరగొట్టారు. మొత్తం 85 పతకాలు సాధించిన భారత జట్టు పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో 21 బంగారు, 27 వెండి, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత క్రీడా బృందం చూపిన అసమాన ప్రతిభపై రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు ఎన్నో గర్వకారణమైన క్షణాలను అందించినందుకు అథ్లెట్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు ముందుండి పతకాల పంట పండించడం, యువతులకు సరికొత్త స్ఫూర్తిని నింపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. భారత జెర్సీని గర్వంగా ధరించి దేశ కీర్తిని పెంచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.
ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో క్రికెట్, హాకీ, కబడ్డీ క్రీడల్లో భారత్ డబుల్ గోల్డ్ సాధించి చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో గెలిచి స్వర్ణాన్ని కాపాడుకుంది. హాకీలో పురుషుల జట్టు మలేషియాపై 5-1తో, మహిళల జట్టు చైనాపై 1-0తో గెలిచి 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా బెర్తులు ఖరారు చేసుకున్నాయి.
బాక్సింగ్‌లో మూడు, రెజ్లింగ్‌లో రెండు, షూటింగ్‌లో మూడు, విలువిద్యలో ఏకంగా ఐదు స్వర్ణాలు భారత ఖాతాలో చేరాయి. భారత క్రీడాకారుల పట్టుదల, కఠిన శ్రమ వల్లే ఈ ఘనత సాధ్యమైంది.

రిలయన్స్ ఫౌండేషన్ అందించిన సహకారంతో 48 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా, వారి ద్వారానే ఏకంగా 29 పతకాలు రావడం విశేషం. భారత క్రీడల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తమవంతు నిరంతర తోడ్పాటు అందిస్తామని నీతా అంబానీ స్పష్టం చేశారు.














