Last Updated:
సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, లింగ వివక్ష, బాధితుల పట్ల వ్యవహరించే తీరు వంటి అంశాలపై స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటారు.
సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, లింగ వివక్ష, బాధితుల పట్ల వ్యవహరించే తీరు వంటి అంశాలపై స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాల్లో సూటిగా స్పందించే సమంత.. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఓ ఆలోచింపజేసే సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ చర్చనీయాంశంగా మారింది.
సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “We can still change” అనే సందేశంతో ఉన్న ఓ పోస్టును షేర్ చేశారు. ఇందులో సమాజంలో కొన్ని వర్గాల పట్ల ఉన్న వివక్ష, బాధితులపై వేసే నిందలు, తప్పు చేసినవారిని ప్రశ్నించడంలో కనిపించే నిర్లక్ష్యం వంటి అంశాలను ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాలను ప్రస్తావిస్తూ.. మన ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరాన్ని ఈ పోస్ట్ గుర్తుచేస్తోంది.

సెక్స్ వర్కర్లను సమాజం తరచూ తప్పుబడుతుందని, అయితే వారి వద్దకు వెళ్లే క్లయింట్లను మాత్రం ఎందుకు ప్రశ్నించరని ఈ సందేశం ప్రశ్నించింది. అలాగే సింగిల్ మదర్స్‌ను విమర్శించే ముందు.. పిల్లల బాధ్యత తీసుకోకుండా వెళ్లిపోయిన తండ్రులను ఎందుకు నిలదీయరని అడిగింది. ఇలాంటి ప్రశ్నలు సమాజంలో ఉన్న ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపేలా ఉన్నాయి.
అదేవిధంగా అత్యాచారానికి గురైన బాధితులను తప్పుబట్టే పరిస్థితులపైనా ఈ పోస్టులో ప్రశ్నలు లేవనెత్తారు. నేరానికి పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించాల్సింది పోయి బాధితురాలినే వేలెత్తి చూపడం ఎందుకు అనే అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా తప్పులను దాచిపెట్టేవారిని పట్టించుకోకుండా.. వాటిని బయటపెట్టి మాట్లాడే వ్యక్తులనే ఎందుకు టార్గెట్ చేస్తారని కూడా ప్రశ్నించారు.
ఈ సందేశం ద్వారా సమాజంలో బాధితుల పట్ల ఉండే దృక్పథం మారాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. తప్పు ఎవరు చేశారనే దానిపై స్పష్టతతో వ్యవహరించడంతో పాటు.. బాధితులను నిందించే విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ పోస్ట్ సూచిస్తోంది. “We can still change” అనే మాట ద్వారా ఇప్పటికైనా మన ఆలోచనల్లో మార్పు తీసుకురావచ్చనే ఆశను వ్యక్తం చేసింది.
మహిళల సమస్యలపై సమంత గతంలోనూ పలుమార్లు తన గళాన్ని వినిపించారు. మహిళలు తమపై తాము నమ్మకం పెట్టుకోవాలని, తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి ఎదగాలని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లపై కూడా సమంత తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల తన సీమంతానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
తాజాగా మహిళలు, సమాజంలో మారాల్సిన దృక్పథం గురించి సమంత షేర్ చేసిన ఈ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. బాధితులను ప్రశ్నించే ముందు అసలు తప్పు చేసిన వారిని ప్రశ్నించాలనే ఆలోచనను ఈ పోస్ట్ బలంగా ముందుకు తీసుకొస్తోంది.














