Last Updated:
ప్రపంచ దేశాలు పాకిస్థాన్ సైనిక పాలనకు మద్దతిచ్చిన క్లిష్ట సమయాల్లోనూ సోవియట్ యూనియన్ భారత్‌కు అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. విదేశాల ఒత్తిళ్లకు తలొగ్గి మాస్కోతో సంబంధాలు వదులుకోబోమని స్పష్టం చేశారు.
రష్యాతో భారత్ కొనసాగిస్తున్న మైత్రీ బంధంపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి బదులిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ లీడర్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, 1950ల నాటి నుంచి రష్యాతో భారత్‌కు విడదీయరాని చారిత్రక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. మంచిదైనా, చెడ్డదైనా ఎవరూ చరిత్రను అంత సులభంగా మర్చిపోరని ఆయన కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లోని పాకిస్థాన్ సైనిక నియంతృత్వానికి ప్రపంచంలోని అనేక దేశాలు బహిరంగంగా మద్దతు పలికిన సమయంలో, నాటి సోవియట్ యూనియన్ భారత్ ప్రాదేశిక సమగ్రతను, భద్రతను కాపాడటానికి నిలబడిందని వివరించారు.
1971 నాటి భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా తన యుద్ధ నౌకలను బంగాళాఖాతంలోకి పంపినప్పుడు సైతం రష్యా వెన్నుదన్నుగా నిలిచిందని ఉదహరించారు. ఆ పాత అనుభవాలు, పరస్పర విశ్వాసాలే ఇప్పటికీ ఇరు దేశాల బంధానికి బలమైన పునాదిగా కొనసాగుతున్నాయని తేల్చిచెప్పారు.
ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ, మాస్కో నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగించడాన్ని జైశంకర్ సమర్థించుకున్నారు. తమ ప్రజల ఇంధన అవసరాలను తీర్చడమే దేశానికి ప్రధాన కర్తవ్యమని, సరసమైన ధరలకు లభించే వనరులను వినియోగించుకుంటామని చెప్పారు. ఇంధన భద్రత విషయంలో ఒకే దేశంపై ఆధారపడకుండా విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నామని వివరించారు.
మూడో దేశం అభ్యంతరాలు వ్యక్తం చేసినంత మాత్రాన దశాబ్దాల మైత్రిని విడనాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రష్యాతో సంబంధాలు ఇప్పటివరకు స్థిరంగా, సానుకూలంగా కొనసాగుతున్నాయని విశ్లేషించారు.
మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం తక్షణమే ముగియాలని, ఇరుపక్షాలు చర్చల ద్వారానే సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ మొదటినుంచీ కోరుతోందని గుర్తుచేశారు. నల్లసముద్రంలో రవాణా రక్షణ, ఇంధన భద్రత, ఆహార సంక్షోభం నివారణ దిశగా భారత్ రెండు దేశాలతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.














