Last Updated:
అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఓ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ మరణానికి ఆ యువతి బాధ్యత వహించాలా? ఆమెను నేరస్థురాలిగా పరిగణించవచ్చా? ప్రేమలో ‘నో’ చెప్పే హక్కు అమ్మాయికి లేదా? ఇలాంటి కీలకమైన ప్రశ్నలను చర్చిస్తూ తెరకెక్కిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’.
అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఓ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ మరణానికి ఆ యువతి బాధ్యత వహించాలా? ఆమెను నేరస్థురాలిగా పరిగణించవచ్చా? ప్రేమలో ‘నో’ చెప్పే హక్కు అమ్మాయికి లేదా? ఇలాంటి కీలకమైన ప్రశ్నలను చర్చిస్తూ తెరకెక్కిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’. మృణాల్ ఠాకూర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో విక్రం సింగ్ చౌహాన్, హ్యూమా ఖురేషి, విజయ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విపాషా అరవింద్, నవజోత్ గులాటి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
పూజ (మృణాల్ ఠాకూర్)ను అనికేత్ (విక్రం సింగ్ చౌహాన్) ప్రేమిస్తాడు. అయితే పూజ అతడిని స్నేహితుడిగానే భావించి, తన మాజీ ప్రియుడు విక్రంతో మళ్లీ రిలేషన్‌లోకి వెళ్తుంది. దీంతో మనస్తాపానికి గురైన అనికేత్.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పూజకు ఈమెయిల్ పంపి ప్రాణాలు తీసుకుంటాడు. దీంతో అతడి మరణానికి పూజే కారణమంటూ ఆరోపణలు రావడంతో ఆమెపై కేసు నమోదవుతుంది. పూజ తరఫున సనా (హ్యూమా ఖురేషి), అనికేత్ కుటుంబం తరఫున జతిన్ (విజయ్ రాజ్) కోర్టులో వాదిస్తారు. విచారణలో పూజ, అనికేత్ మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడతాయి. అసలు అనికేత్ ఆత్మహత్యకు పూజ నిజంగానే కారణమా? అనేదే సినిమా కథ.
ప్రేమను తిరస్కరించినందుకు అమ్మాయిని నిందించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ‘పూజా మేరీ జాన్’ బలంగా తెరపైకి తీసుకొచ్చింది. ఒక అమ్మాయికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని, ప్రేమలో తిరస్కరణను అంగీకరించడం కూడా నేర్చుకోవాలని సినిమా చెబుతుంది. న్యాయస్థానంలో నింద తొలగిపోయినా, సమాజంలో మాత్రం మహిళలు ఎదుర్కొనే తీర్పు మరోలా ఉంటుందనే అంశాన్ని కూడా చూపించింది.
రెండు గంటల్లోపే ముగిసే సినిమా కావడంతో కథనం పెద్దగా సాగదీసినట్లు అనిపించదు. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా ఉంచుతాయి. అయితే కోర్ట్‌రూమ్ సన్నివేశాలు మరింత బలంగా ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. కొన్ని సాక్షుల విచారణ సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. పాటలు కూడా కథాగమనానికి అంతగా ఉపయోగపడకపోగా కొంత ఇబ్బంది పెడతాయి.
పూజ పాత్రలో మృణాల్ ఠాకూర్ చక్కగా నటించింది. తాను చేయని తప్పుకు నిందను మోస్తున్న యువతిగా ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. సనా పాత్రలో హ్యూమా ఖురేషి మెప్పిస్తుంది. విజయ్ రాజ్‌కు ఇలాంటి న్యాయవాది పాత్రలు కొట్టినపిండే. అనికేత్ పాత్రలో విక్రం సింగ్ చౌహాన్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు.
ప్రేమ, తిరస్కరణ, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక తీర్పు వంటి అంశాలను చర్చిస్తూ థ్రిల్‌తో పాటు ఓ ముఖ్యమైన సందేశాన్ని అందించే చిత్రం ‘పూజా మేరీ జాన్’.














