TTD News: మాట రాదు.. చెవి వినిపించదు.. విద్యార్థులతో ఈ పాచి పనులేంటి? టీటీడీ ఐటీఐలో సిబ్బంది పైశాచికత్వం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

చదువుకోవడానికి వెళ్తే చేతికి చీపుర్లు ఇచ్చారు.. టీటీడీ ఐటీఐలో వికలాంగుల కన్నీటి గాథ!

+

News18

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనగానే దేశవ్యాప్తంగా అపారమైన భక్తిభావం, నమ్మకం కనిపిస్తాయి. అన్నదానంతో పాటు విద్యాదానంలోనూ టీటీడీ ఎప్పుడూ ముందుంటుంది. కానీ, ఆ ప్రతిష్టాత్మక సంస్థ నీడలో నడుస్తున్న ఒక విద్యాసంస్థలో మాత్రం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బధిర ఐటీఐ కళాశాలలో సిబ్బంది అరాచకాలు శృతి మించాయి. చదువుకోవాల్సిన చేతులతో పాచి పనులు చేయిస్తూ, విద్యార్థులను కట్టు బానిసలుగా మార్చేసిన అమానవీయ ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతున్నాయి.

బధిర ఐటీఐలో కొంతకాలంగా సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవడానికి వచ్చిన తమను సిబ్బంది ఇంటి పనులకు, వంట పనులకు వాడుకుంటున్నారని కన్నీటిపర్యంతం అవుతున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేపి చీపుర్లు చేతికిచ్చి ఊడ్పిస్తున్నారు. ఒకవేళ ఆ పనులు చేయడానికి నిరాకరిస్తే దారుణంగా బెదిరింపులకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. మాటలు రాని, చెవులు వినిపించని తమ నిస్సహాయతను సిబ్బంది ఆసరాగా చేసుకుని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు సైగలతో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Indiramma House: ఇంకో 4 రోజులే.. లేదంటే మీ ఇందిరమ్మ ఇల్లు రద్దు, ప్రభుత్వం హెచ్చరిక!

ఈ అదనపు పనుల భారం, వేధింపుల కారణంగా విద్యార్థులు తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తెల్లవారుజాము నుంచే చాకిరీ చేయిస్తుండటంతో అలిసిపోయి సకాలంలో తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. తరగతులకు వెళ్లినా నిద్రమత్తు, అలసటతో పాఠాలపై దృష్టి పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృత్తి విద్యా నైపుణ్యాలు నేర్చుకుని భవిష్యత్తులో స్థిరపడాలనే ఆశలతో ఐటీఐలో చేరితే, ఇక్కడ తమను కేవలం పనోళ్లుగా మాత్రమే చూస్తున్నారని విద్యార్థులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన సిబ్బందే ఇలా అకృత్యాలకు పాల్పడటం విమర్శలకు తావిస్తోంది.

ఇది కూడా చదవండి: గుడిలో అద్భుతం.. శివలింగానికి పూజలు చేసిన 3 నాగుపాములు, వీడియో వైరల్!

తమకు జరుగుతున్న ఈ అన్యాయంపై, సిబ్బంది పెడుతున్న చిత్రహింసలపై విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన కరువైంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ప్రిన్సిపాల్ చూసీచూడనట్లు వ్యవహరించడం సిబ్బందికి మరింత బలాన్నిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇటీవల ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది బలవంతంగా ఓ విద్యార్థితో స్నానాల గదిని శుభ్రం చేయిస్తుండగా ఆ విద్యార్థి కంటికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనతో మిగతా విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆందోళన, అభద్రతాభావం మరింతగా పెరిగిపోయాయి.

రోజురోజుకూ పెరుగుతున్న ఈ వేధింపులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని బధిర విద్యార్థులు టీటీడీ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. చదువుకోవాల్సిన తమతో బలవంతంగా పనులు చేయిస్తూ, తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్న నిర్లక్ష్యపు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సున్నితమైన వ్యవహారంపై టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జేఈవో) నేరుగా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తమ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి వేధింపులు పునరావృతం కాకుండా తమకు న్యాయం చేయాలని దివ్యాంగ విద్యార్థులు రెండు చేతులూ జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed