Last Updated:
Road Accident: ఉన్నత భవిష్యత్తును వెతుక్కుంటూ అమెరికా వెళ్లిన ఓ తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువతి మృత్యువాత పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితురాలి మృతి వార్త విన్న వెంటనే ఆమె స్వస్థలమైన మహబూబాబాద్, కుటుంబం నివాసముంటున్న ఖమ్మం జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులు, బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన దారం శ్రీనివాసరావు కుటుంబం గత నాలుగేళ్లుగా ఖమ్మం జిల్లా ఏనులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రినగర్ కాలనీలో స్థిరపడింది. శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుప్రియ (30)కు 2021లో మహబూబాబాద్ పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొడుమూరి రంజిత్‌తో ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం ఈ దంపతులు 2022లో ఉపాధి, ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. భర్త రంజిత్ స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, సుప్రియ ఓ రెస్టారెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీరికి మూడేళ్ల వయస్సు గల ఓ కుమారుడు ఉన్నాడు.
ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున సుప్రియ విధులు ముగించుకుని తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్ నుంచి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఓ భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ భయానక ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో సుప్రియ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న ఆమె స్నేహితురాలు కూడా తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రెస్టారెంట్‌ను చక్కగా నిర్వహిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న సుప్రియ ఆకస్మికంగా మరణించడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడేళ్ల పసికందు తల్లి లేనివాడైపోయాడని బంధువులు రోదిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. చేతికి అందివచ్చిన కుమార్తె పరాయి దేశంలో రోడ్డు ప్రమాదానికి గురై కానరాని లోకాలకు వెళ్లిపోయిందన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అమెరికాలోని ప్రవాస భారతీయ సంఘాలు (తెలుగు సంఘాలు), స్థానిక మిత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మృతదేహం వీలైనంత త్వరగా స్వస్థలానికి చేరేలా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ చొరవ చూపి సహకరించాలని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో సుప్రియ మంచి ప్రవర్తనతో అందరితో ఆప్యాయంగా ఉండేదని, ఆమె అకాల మరణం తమ గ్రామానికి తీరని లోటని స్థానికులు విచారం వ్యక్తం చేశారు.














