Last Updated:
దాదాపు నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్ టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో స్టార్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై ఆశలు చిగురించాయి. షమీ త్వరలోనే దేశానికి ఆడతాడని కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా ధీమా వ్యక్తం చేశారు.
దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండుసార్లు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన భువీ, న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. భువనేశ్వర్ అద్భుత పునరాగమనం మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీలో సరికొత్త ఆశలను రేకెత్తించింది. 2025 మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ భారత జట్టు తరఫున ఆడలేదు. భువీ తరహాలోనే దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి తిరిగి జాతీయ జట్టులోకి రావాలని షమీ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రస్తుత బెంగాల్ ప్రధాన కోచ్, భారత మాజీ పేసర్ లక్ష్మీ రతన్ శుక్లా షమీ పునరాగమనంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. షమీ ఈ సీజన్లో బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నారని, ఒక యువ బౌలర్లా ఎంతో ఉత్సాహంగా బౌలింగ్ చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచ క్రికెట్ చూసిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో షమీ ఒకరని, ఆయన కెరీర్ భారత జెర్సీతోనే ఘనంగా ముగియాలని శుక్లా ఆకాంక్షించారు.
నెట్ బౌలర్గా ఉన్న రోజుల్లో తన కెప్టెన్సీలోనే షమీ బెంగాల్ తరఫున అరంగేట్రం చేశారని శుక్లా గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ దేశవాళీ క్రికెట్ పట్ల షమీ చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్లో యువ ఆటగాళ్లకు ఆయన నిరంతరం స్ఫూర్తిని నింపుతున్నారని తెలిపారు.
భారత్ తరఫున 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన 36 ఏళ్ల షమీ కూడా తన పునరాగమనంపై బలమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇటీవల ముగిసిన 2026 దులీప్ ట్రోఫీ ఫైనల్ అనంతరం మాట్లాడిన ఆయన, ఏ దశలో ఆడుతున్నా అత్యున్నత స్థాయికి చేరడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. స్వయం ప్రేరణతో ముందుకు సాగుతూ మళ్లీ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.














