Last Updated:
మైసూర్ దసరా ఏనుగులకు భారీ శబ్దాల శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఫిరంగుల మోతకు ఏనుగులు బెదరకుండా ప్రశాంతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మైసూర్ దసరా అంటే ఏనుగుల వైభవం.. జంబూ సవారి అంటే వేలాది మంది జనం మధ్య గంభీరంగా సాగే గజరాజుల ఊరేగింపు. అయితే ఇంత భారీ కార్యక్రమంలో ఒక్కసారిగా వచ్చే పెద్ద శబ్దాలకు ఏనుగులు భయపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే దసరా ఏనుగులను ముందుగానే భారీ శబ్దాలకు అలవాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో 2026 మైసూర్ దసరా ఏనుగుల బృందానికి తొలి శబ్ద అలవాటు పరీక్ష విజయవంతంగా పూర్తైంది.
మైసూర్‌లో నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణలో ఏనుగులతో పాటు మౌంటెడ్ కంపెనీకి చెందిన గుర్రాలను కూడా పాల్గొనించారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) సిబ్బంది 21 సంప్రదాయ ఫిరంగి వందనాలను కాల్చగా.. అదే సమయంలో జాతీయ గీతాన్ని కూడా వినిపించారు. భారీ పేలుళ్ల శబ్దం, మంటల వెలుగుల మధ్య ఏనుగులు, గుర్రాలు ఎలా స్పందిస్తాయో పరిశీలించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం.
ఏనుగుల బృందానికి కెప్టెన్‌గా ఉన్న అభిమన్యు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వరుసగా భారీ శబ్దాలు వినిపించినా.. ఎక్కువశాతం ఏనుగులు ఏమాత్రం బెదరకుండా ప్రశాంతంగా నిలబడ్డాయి. ఫిరంగుల శబ్దాలు చుట్టుపక్కల మార్మోగుతున్నా వాటి ప్రవర్తనలో పెద్దగా మార్పు కనిపించలేదు. దీంతో అధికారులు, ఏనుగుల సంరక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే శ్రీరామ అనే ఏనుగు మాత్రం కాసేపు ఆందోళనకు గురైంది. భారీ శబ్దాలతో అసహనంగా స్పందించడంతో దాని మావటి, కావడి వెంటనే దగ్గరకు వెళ్లి దాన్ని శాంతింపజేశారు. కొద్దిసేపటికే శ్రీరామ కూడా సాధారణ స్థితికి వచ్చింది. రాబోయే మరిన్ని శిక్షణల్లో ఇది కూడా పెద్ద శబ్దాలకు పూర్తిగా అలవాటు పడుతుందని అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు.
జంబూ సవారి సమయంలో ఏనుగులు వేలాది మంది ప్రజల మధ్య, డప్పులు, బ్యాండ్లు, బాణసంచా, ఫిరంగి వందనాలు వంటి భారీ శబ్దాల నడుమ ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో అవి ఒక్కసారిగా భయపడకుండా ఉండేందుకు ఈ శబ్ద అలవాటు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దసరా ఊరేగింపులో పాల్గొనే ఏనుగులకు ఇది అత్యంత కీలకమైన శిక్షణగా భావిస్తారు.













