Last Updated:
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు ప్రక్రియలో కీలకమైన పర్మ్ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ప్రధాన ఐటీ కంపెనీలను ట్రంప్ సర్కార్ సస్పెండ్ చేసింది. భారత నిపుణుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
అమెరికాలో గ్రీన్ కార్డు ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. హెచ్-1బీ వీసాదారులకు ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో అత్యంత కీలకమైన ‘పర్మ్’ (PERM) లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలను అమెరికా కార్మిక శాఖ సస్పెండ్ చేసింది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నిబంధనలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఆ కంపెనీపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గురువారం అధికారికంగా వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు భారతీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, అలాగే కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, అడోబ్ సంస్థల పర్మ్ దరఖాస్తులపై కూడా ఈ నిషేధం వేటు పడింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్న సంస్థలు విదేశీయులను కాకుండా స్థానిక అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని వాన్స్ స్పష్టం చేశారు.
పర్మ్ (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్) అనేది ఒక అమెరికన్ కంపెనీ విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ఇచ్చే ముందు పూర్తి చేయాల్సిన అధికారిక లేబర్ అనుమతి పత్రం. స్థానికంగా తగిన నైపుణ్యం కలిగిన అమెరికన్ వర్కర్లు లేరని నిరూపించిన తర్వాతే కార్మిక శాఖ ఈ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ వ్యవస్థలో అవకతవకలు జరిగాయన్న విచారణ నేపథ్యంలోనే తాజా నిషేధ నిర్ణయం తీసుకున్నారు.
తాజా ఉత్తర్వులతో ఆయా కంపెనీలు హెచ్-1బీ ఉద్యోగుల కోసం కొత్తగా గ్రీన్‌కార్డుల ప్రక్రియను ప్రారంభించడం అసాధ్యంగా మారుతుంది. అయితే ఇప్పటికే పర్మ్ ఆమోదం పొందిన పాత దరఖాస్తులపై ఈ సస్పెన్షన్ ప్రభావం ఉండదని వలస వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్-1బీ వ్యవస్థతో పాటు ఉపాధి ఆధారిత వీసాలపై నిఘా, ఆంక్షలు తీవ్రతరం చేశారు. విదేశీ నిపుణుల వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదన్న వాదనతో ట్రంప్ యంత్రాంగం ఈ కఠిన విధానాలను అమలు చేస్తోంది. ఈ నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీల భవిష్యత్తును తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది.














