Last Updated:
రణబాలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్న ఎమోషనల్ అయ్యారు. కేవలం నలుగురిని సంతృప్తిపరచడానికి ముసుగు వేసుకుని ఫేక్‌గా బతకడం నా వల్ల కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తమపై నిరంతరం వ్యక్తమయ్యే ట్రోలింగ్, ద్వేషపూరిత ప్రచారాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత.. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’. ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ జంట చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
గత కొంతకాలంగా తన తీరు, ప్రవర్తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్లను రష్మిక సూటిగా తిప్పికొట్టారు. “ప్రజల ముందు కనిపించేటప్పుడు నేను ఎప్పుడూ నాలాగే ఉంటాను తప్ప, ప్రచారం కోసమో లేదా ఇతరులను ఆకర్షించడానికో నా సహజత్వాన్ని చంపుకోలేను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నేను నచ్చాలని రూల్ లేదు. కొంతమంది నా ప్రవర్తనను ఓవరాక్షన్ అని విమర్శించినా సరే, నేను మాత్రం వారి పట్ల కూడా దయ, పాజిటివిటీని పంచడానికే మొగ్గుచూపుతాను. కేవలం నలుగురిని సంతృప్తిపరచడానికి ముసుగు వేసుకుని ఫేక్‌గా బతకడం నా వల్ల కాదు” అంటూ విమర్శకుల నోళ్లు మూయించారు.
రష్మిక వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తూ విజయ్ దేవరకొండ సైతం సైబర్ ట్రోలర్ల తీరుపై నిప్పులు చెరిగారు. “వ్యక్తిగతంగా జీవితంలో కనీసం ఒక్కసారి కూడా కలవని వారిపై అంతటి ద్వేషాన్ని, తీవ్రమైన దురభిప్రాయాలను కొందరు ఎలా పెంచుకుంటారో ఊహకే అందడం లేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌లలో అత్యధిక భాగం కావాలని సృష్టించేవే. ఒక మనిషి వ్యక్తిత్వం ఏమిటో తెలియకుండా, సోషల్ మీడియా క్లిప్పింగులు చూసి వారి జీవితాన్ని జడ్జ్ చేయడం విడ్డూరంగా ఉంది” అని విజయ్ స్పష్టం చేశారు.
వెండితెరపై అద్భుతమైన కెమిస్ట్రీ పండించే ఈ జోడీ, నిజ జీవితంలో పెళ్లి బంధంతో ఒక్కటైన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’ కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది.














