Comrade Kalyan Review: ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ మరోసారి వర్కవుట్ అయిందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Comrade Kalyan Review: 'కామ్రేడ్ కళ్యాణ్' రివ్యూ.. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ మరోసారి వర్కవుట్ అయిందా? | తెలుగు సినిమా వార్తలు

[ad_1]

కథేంటంటే?

1994 నేపథ్యంలో సాగే ఈ కథ మాడుగుల అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఓ పాత థియేటర్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు కళ్యాణ్ (శ్రీవిష్ణు). ఎప్పటికైనా ఆ థియేటర్‌కు యజమాని కావాలనేది అతడి కల. మరోవైపు, కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్) బాలకృష్ణ అభిమాని. తరచూ ఫ్యాన్ వార్స్‌లో పాల్గొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో ఆమెను విడిపించడం కళ్యాణ్‌కు తలనొప్పిగా మారుతుంది.

ఈ క్రమంలో అతడి జీవితంలోకి సితార (మహిమా నంబియార్) వస్తుంది. ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. సితార ఒరియా అమ్మాయి అనుకుని ఆ భాష నేర్చుకొని మరీ తన ప్రేమను వ్యక్తం చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉందని తెలుసుకుంటాడు. సితారను కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయంతో అతడి జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. అసలు కళ్యాణ్ కామ్రేడ్‌గా ఎందుకు మారాడు? పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఎలా మారాడు? అన్నది తెరపై చూడాలి.

సినిమా ఎలా ఉందంటే?

నక్సలిజం, పోలీసులు, అడవులు, ఎన్‌కౌంటర్లు.. ఇలాంటి అంశాలు ఉన్నాయంటే సాధారణంగా సీరియస్ కథ, బలమైన భావోద్వేగాలు ఉంటాయని భావిస్తాం. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ మాత్రం ఈ నేపథ్యాన్ని పూర్తిగా వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసింది. కథలోని సీరియస్ అంశాల కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ఫస్టాఫ్‌లో శ్రీవిష్ణు, సత్య, సుదర్శన్ కలిసి చేసే హంగామా ప్రేక్షకులను నవ్విస్తుంది. ముఖ్యంగా సత్య ఎంట్రీ తర్వాత వినోదం మరింత పెరుగుతుంది. ప్రేమలేఖ ఎపిసోడ్, పాత్రల మధ్య సంభాషణలు అక్కడక్కడా నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే మలుపు కథపై ఆసక్తిని పెంచుతుంది.

అయితే, సినిమా ముందుకు వెళ్లేకొద్దీ కథలో లాజిక్ కంటే కామెడీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 1990ల నేపథ్యంలో కథ సాగుతున్నా, సంభాషణలు మాత్రం ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంటాయి. కొన్ని పంచ్ డైలాగులు, సమకాలీన అంశాల ప్రస్తావనలు సరదాగా అనిపించినా, మరికొన్ని చోట్ల ద్వంద్వార్థాలు ఎక్కువయ్యాయి.

సెకండాఫ్‌లో అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆసక్తిని కలిగించినప్పటికీ, కథలో బలమైన భావోద్వేగాలు కనిపించవు. నక్సలిజం, పోలీసు వ్యవస్థ మధ్య సంఘర్షణను లోతుగా చూపించే అవకాశం ఉన్నా, దర్శకుడు ఎక్కువగా కామెడీ వైపే మొగ్గు చూపారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ప్రభావం చూపదు. లాజిక్ గురించి ఆలోచించకుండా వినోదం కోసం చూస్తే సినిమా కొంతవరకు ఆకట్టుకుంటుంది.

నటీనటులు పర్ఫార్మెన్స్:

శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను ముందుకు నడిపించారు. సత్య, సుదర్శన్ తమ పాత్రలతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఉపేంద్ర లిమాయే, బ్రహ్మాజీ, రఘుబాబు, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అయితే మహిమా నంబియార్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. షైన్ టామ్ చాకో పాత్ర కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేదు.

సాంకేతిక విభాగం:

సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే 90ల కాలాన్ని ప్రతిబింబించే వాతావరణం, మాటలు, కాస్ట్యూమ్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది.

ఫైనల్‌గా:

‘కామ్రేడ్ కళ్యాణ్’లో శ్రీవిష్ణు కామెడీ, సత్య టైమింగ్ ప్రధాన ఆకర్షణలు. కొన్ని సన్నివేశాలు నవ్వించినా, బలమైన కథనం, భావోద్వేగాలు, లాజిక్ విషయంలో సినిమా నిరాశపరుస్తుంది. కథలో కొత్తదనం, సీరియస్ నేపథ్యానికి తగ్గ లోతు ఆశించే వారికి ఇది అంతగా నచ్చకపోవచ్చు. కేవలం కాసేపు నవ్వుకుంటూ కాలక్షేపం చేయాలనుకునేవారు మాత్రం ఈ సినిమాను ఓసారి ప్రయత్నించవచ్చు.

రేటింగ్: 3

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports