Last Updated:
నేచురల్ స్టార్ నాని మళ్ళీ లుక్ మార్చేశాడు. ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నాని పెంచిన పొడవాటి జుట్టు, రఫ్ అండ్ రస్టిక్ గెటప్ నుంచి మరో గెటప్ లోకి ట్రాన్స్‌ఫామ్ అయ్యారు.
నేచురల్ స్టార్ నాని అంటేనే వైవిధ్యమైన పాత్రలకు, విభిన్నమైన కథలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి సినిమాకూ తన బాడీ లాంగ్వేజ్‌ను, లుక్‌ను మార్చుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడం ఆయన శైలి. ఇటీవల ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నాని పెంచిన పొడవాటి జుట్టు, రఫ్ అండ్ రస్టిక్ గెటప్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, నాని అదే లాంగ్ హెయిర్ తో కనిపిస్తూ రావడంతో తన తదుపరి భారీ ప్రాజెక్టుల కోసం ఎలాంటి మేకోవర్ తో వస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలోనే యాక్షన్ సినిమాలను అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించే యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ‘బ్లడీ రోమియో’ చిత్రం కోసం నాని తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు.
‘బ్లడీ రోమియో’ కోసం నాని ఒక సరికొత్త గ్యాంగ్ స్టర్ లుక్ లోకి మారినట్లు మేకర్స్ తాజాగా ఒక సాలిడ్ వీడియో గ్లింప్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ వీడియోలో నాని తన పాత జడల లుక్ ను వదిలించుకుని, పూర్తిగా రిఫ్రెషింగ్ అండ్ స్టైలిష్ అవతార్ లోకి మారడం విశేషం. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో నాని ఒక వెస్ట్రన్ చెఫ్ తరహాలో కనిపిస్తూనే, మరోవైపు గ్యాంగ్ స్టర్ వైబ్స్ ఇస్తుండటం సినిమా కథపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. సుజీత్ తన హీరోలను హాలీవుడ్ స్థాయిలో స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు నానిని కూడా మునుపెన్నడూ చూడని విధంగా ఒక షార్ప్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్లు ఈ మేకోవర్ వీడియో స్పష్టం చేస్తోంది. ఒక చెఫ్ కు, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
క్లాస్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కు కూడా నాని కొత్త ట్రాన్స్ఫర్మేషన్ ఓ రేంజ్‌లో కిక్ ఇస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నాని కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.














